కోదండ‌రాం పేరుతో కేసీఆర్‌ ను టార్గెట్ చేశారు

Update: 2016-05-26 12:03 GMT
తెలంగాణ ఉద్య‌మంలో క‌లిసి న‌డిచిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంల మధ్య ఇపుడు ఒకింత గ్యాప్‌ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నారు. తాజాగా జరిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు న్యాయం చేయ‌డంలో సీఎం కేసీఆర్ జేఏసీ చైర్మ‌న్ స‌ల‌హా తీసుకోవాల‌ని సూచించారు.

శాసనసభలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200మంది అమరులయ్యారని చెప్పిన కేసీఆర్ వారి కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వారి అడ్రస్‌ లు దొరకడం లేదంటూ తన వంకర బుద్ధిని చాటుకున్నారని రేవంత్ మండిప‌డ్డారు. సమగ్ర కుటుంబ సర్వేతో 12 గంటల్లో 4 కోట్ల మంది ప్రజల చిట్టా తన చేతుల్లో ఉందన్న కేసీఆర్‌కు 1200 మంది అమరుల అడ్రస్‌లు దొరకకపోవడం విడ్డూరంగా ఉందని ఆయ‌న ఎద్దేవా చేశారు. జేఏసీ చైర్మ‌న్‌ ప్రొఫెసర్ కోదండరాం ప్రచురించిన అమరుల పుస్తకంలో వారి వివరాలున్నాయని కావాలంటే అవి చూసుకుని రాష్ట్ర సాధనకు బలిదానం చేసిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. అది కూడా ఇష్టం లేక‌పోతే తాము సైతం వివ‌రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి శ్రీకాంత్‌ చారి - వేణుగోపాల్‌ రెడ్డిల బలిదానాలతో ఊపిరులూదిన నల్లగొండ గడ్డ నుండే సీఎం కేసీఆర్‌ ను గద్దె దించే పోరాటాన్ని ఆరంభించామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ ద్రోహుల పార్టీగా టీడీపీను తిడుతూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్ ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టీడీపీలోకి చేర్చుకుని నిజమైన తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని రేవంత్ విమ‌ర్శించారు.  టీడీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొని మంత్రులను చేసిన కేసీఆర్ 14 ఏళ్ల టీఆర్‌ ఎస్ పార్టీలో ఒక్క మంత్రి స్థాయి పరిపాలన సామర్థ్యం ఉన్న నాయకుడిని తయారు చేయలేని సన్నాసిగా మారాడని ఆవేశంగా విమ‌ర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన త‌ర్వాత‌ ఇప్పటిదాకా 2 లక్షల 15 వేల కోట్ల బడ్జెట్ ఖర్చయిందని కేసీఆర్ చెప్తున్నార‌ని అయితే గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడా కూడా రెండు మూడు కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగలేదన్నారు. అలాంటప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోటి ఏకరాలకు సాగునీరంటూ ప్రజలను కేసీఆర్ మోసగిస్తున్నారన్నారు. కేసీఆర్ రెండేళ్ల పరిపాలనను ప్రజలు గమనించి టీఆర్‌ ఎస్ భ్రమల నుండి దూరం జరుగుతున్నారని రేవంత్ అన్నారు.
Tags:    

Similar News