నీచ్ , కమీనే.. అంటూ రాజగోపాల్ రెడ్డిపై రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి

Update: 2022-08-05 16:45 GMT
కాంగ్రెస్ కు రాజీనామా బీజేపీలో చేరడానికి రెడీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించాడు. కాంగ్రెస్ ను చీట్ చేసి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ ను వదలమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మునుగోడులో కార్యకర్తలు,నేతలతో సభ పెట్టి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు.తీవ్ర విమర్శలు గుప్పించారు.

మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురువేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ ను రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని.. అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా గంటలో దామోదర్ రెడ్డి వస్తారని.. రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్ తెలిపారు.తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లి అని అన్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీని గెలిపించాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకనే మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తెరిచారని.. అన్యాయంగా సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ జరుపుతున్నారని అన్నారు.

సోనియా గాంధీని ఈడీ విచారణ జరుపుతుంటే రాజగోపాల్ రెడ్డి ఏకంగా అమిత్ షా దగ్గరకు వెళ్లారని.. కాంగ్రెస్ పోరాటంలో కలిసి రాలేదన్నారు. కాంట్రాక్టుల కోసమే అమిత్ షా వద్దకు వెళ్లాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఒక్క ఎమ్మెల్యే పోయినా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని.. మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి.. కేంద్రం నుంచి నిధులు తెస్తారా? అని రేవంత్ ప్రశ్నించారు. నెలరోజులు జైల్లో ఉన్న తనతో కలిసి ఉండలేనన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు 90 రోజులు జైల్లో ఉన్న అమిత్ షాతో ఎలా కలిసి పనిచేస్తావ్? అని నిలదీశారు.

ఇక కాంగ్రెస్ లో పదవులు అనుభవించి పార్టీని వీడారని.. నీచ్ , కమీనే, అంటూ రాజ గోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే  గెలుస్తుందని.. గెలిపించాలని.. మోసం చేసిన రాజగోపాల్ రెడ్డిని పాతిపెట్టాలని కాంగ్రెస్ శ్రేణులు,ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Tags:    

Similar News