రేవంత్ రెడ్డి మళ్లీ బ్యాడ్ టైం

Update: 2016-08-30 09:35 GMT
    కొద్దికాలంగా కష్టాల్లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి ఈమధ్యే ఒక్కటొక్కటిగా కష్టాలు తొలగుతూ వచ్చాయి. కానీ... తాజాగా మళ్లీ ఆయనకు బ్యాడ్ టైం మొదలైనట్లుగా ఉంది. ముఖ్యంగా  ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన ఆయన ఆ త‌రువాత బెయిల్ పై బ‌య‌టికి వ‌చ్చారు. అనంతరం ఓటుకు నోటు కేసులో బాగా అన్ పాపులర్ అయ్యారు. అదే సమయంలో రేవంత్ కు ప్రభుత్వం భద్రత తగ్గించడంతో హైకోర్టును ఆశ్రయించారాయన. కొంద‌రు త‌న‌ను చంపాల‌ని చూస్తున్నార‌ని కోర్టులో పిటిష‌న్ వేశారు. తెలంగాణ పోలీసుల‌పై తనకు న‌మ్మకం లేద‌ని చెబుతూ ప్రాణ భయం ఉందన్నారు.

అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో చంద్రబాబు సాయంతో కేంద్ర హోంమంత్రి వద్దకు విషయం తీసుకెళ్లారు. ఎలాగైతేనేం భ‌ద్రత పెంచుకుని కాస్త ప్రశాంతంగా నిద్రపోయారు.  గ్యాంగ్ స్టర్ నయీం నుంచి ప్రాణహాని ఉందన్న భయంతో ఆయన అంతగా ఆందోళన చెందారని ప్రచారం జరిగింది. అయితే, రీసెంటుగా నయీం ఎన్ కౌంటర్ కావడంతో రేవంత్ కు ఆ భయం కూడా పోయింది. నయీం ఎన్‌ కౌంట‌ర్‌ లో మరణించడం.. ఓటుకు నోటు కేసు పక్కకుపోవడంతో రేవంత్ కు కొంత భారం తగ్గింది.

కానీ.. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఓటుకు నోటు కేసులో స‌రిగా ద‌ర్యాప్తు జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఏపీలోని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌త్యేక కోర్టును ఆశ్ర‌యించడం.. మ‌రోసారి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏసీబీనీ ప్ర‌త్యేక కోర్టు ఆదేశించడంతో మ‌రోసారి రేవంత్‌ నెత్తిన పిడుగు ప‌డ్డంత ప‌నైంది.  మూల‌న ప‌డింద‌నుకుంటున్న కేసు ఇలా మళ్లీ తెర‌పైకి రావ‌డంతో రేవంత్ చాలా టెన్షన్ పడుతున్నారట. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ స‌న్‌ తో ఏపీ సీఎం చంద్ర‌బాబు సాగించిన‌ ఫోన్ సంభాష‌ణ లో ని గొంతు చంద్ర‌బాబుదేన‌ని ధ్రువీక‌రించే ఫోరెన్సిక్ రిపోర్టును కూడా ఈ కేసులో కోర్టుకు సమర్పించడంతో రేవంత్‌ చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News