ఎర్ర‌బెల్లి కంటే ఫాస్ట్ అని నిరూపించిన‌ రేవంత్

Update: 2016-02-12 07:48 GMT
తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం రంజుగా సాగుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అనుకోవ‌చ్చు, అభివృద్ధి మంత్రమే కార‌ణం కావ‌చ్చు....టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారెక్కుతున్నారు. ఏకంగా మూడు రోజుల వ్య‌వ‌ధిలో న‌లుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ జంపింగ్‌ ల‌తో ప‌దిమంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిన‌ట్ల‌యింది.

టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్య‌లో మూడింట‌ రెండు వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారట‌మే కాకుండా త‌మ‌ను టీఆర్ ఎస్ స‌భ్యులుగా గుర్తించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని, ఈ క్ర‌మంలో త‌మ‌కు ఆ గుర్తింపు ఇవ్వ‌మంటూ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారికి లేఖ రాశారు. ఈ వార్త నేప‌థ్యంలో టీడీపీ ఫ్లోర్‌ లీడ‌ర్‌ - పార్టీ తెలంగాణ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి వేగంగా స్పందించారు. ఎర్ర‌బెల్లి స‌హా మిగ‌తా ఎమ్మెల్యేల‌ నిర్ణ‌యం, స్పీక‌ర్‌ కు రాసిన లేఖ విష‌య‌మై చ‌ర్చించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేల‌ను అడ్డుపెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఎర్రబెల్లి ఏకపక్షంగా లేఖ రాశారని, రాజ్యాంగ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వారిని టీఆర్ఎస్ స‌భ్యులుగా గుర్తించ‌వ‌ద్ద‌ని కోరుతూ స్పీక‌ర్‌ ను క‌లిసేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. పార్టీ అధినేత చంద్ర‌బాబు లేఖ‌ను వెంట తీసుకువెళ్ల‌డ‌మే కాకుండా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల‌ను కూడా వెంట‌బెట్టుకొని స్పీక‌ర్‌ను క‌లిసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News