టీఆర్ ఎస్‌ తో క‌లిస్తే..ఐఎస్ ఐతో జ‌ట్టుక‌ట్టిన‌ట్లే

Update: 2017-02-10 13:39 GMT
తెలంగాటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో టీఆర్ ఎస్‌ పై విరుచుకుప‌డ్డారు. టీఆర్ ఎస్ పార్టీతో తెలుగుదేశం క‌లిసి ప‌నిచేసేందుకు చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింద‌ని వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ర‌వేంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. టీఆర్‌ ఎస్‌ తో కలిస్తే ఐఎస్‌ఐ ఏజెంటుతో కలసినట్టేనని రేవంత్ ప‌రుష‌ప‌దాల‌తో విమ‌ర్శించారు. దొరలకు, దొర గడీలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల పక్షాన ఆవిర్భవించిన టీడీపీ, అదే లక్ష్యంతో కేసీఆర్‌ పై పోరాడుతుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

టీఆర్ ఎస్ వైఫ‌ల్యాల‌పై ప్రజల పక్షాన పోరాడటంలో రాష్ట్రంలో ఇతర విపక్షాలు విఫలమైన నేపథ్యంలో పేద ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాటాలు చేస్తోంద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడంలోనూ, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడంలోనూ, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను - ఎస్టీలు - మైనారిటీలు - వికలాంగులకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.జనరంజకమైన ఏ హామీని కూడా టీఆర్ఎస్ అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న కోటి ఎకరాల సాగు అనేది మాటల వరకే తప్ప చేతల్లో చూపడం లేదని ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని  2013-14 సంవత్సరంలో 20 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా 2014-15 సంవత్సరంలో 14 లక్షల 50 వేల హెక్టార్లకు, 2015-16 సంవత్సరంలో 10.9 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇదే సమయంలో వరి దిగుబడులు 60 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నుల వరకు పడిపోయిందని వివ‌రించారు.  3వ విడత రుణమాఫీని ఇంకా 80 శాతం మందికి ఇవ్వలేదని, అన్ని సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేయాలని నిర్ణయించామ‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు. అందుకే ప్ర‌భుత్వంపై ప్ర‌జాక్షేత్రంలో పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు రేవంత్ రెడ్డి వివ‌రించారు.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల‌కు భవనాల‌ను నిర్మించలేదు కానీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ గజ్వేల్ లో మాత్రమే ఎమ్మెల్యే భ‌వ‌న్ ను నిర్మించారని రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను ప్రభుత్వ పరిష్కరించని ప‌క్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామ‌ని తెలిపారు. ఫిబ్రవరి 13 తేదీన కొల్లాపూర్‌ లో, 15వ తేదీన గజ్వేల్ లో, ఫిబ్రవరి 20వ తేదీన నిర్మల్ లో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించామ‌ని వివ‌రించారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో ప్రజలు ఎంత నిరుత్సాహంగా ఉన్నారో తెలియజేయడానికి ఈ సభలు నిర్వహిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై చర్చలు జరపడానికి సమావేశాలు జరుగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News