స్కాం కాకుంటే షాకింగ్ నిర్ణ‌యాలు ఎందుకో?

Update: 2017-06-15 04:02 GMT
లాజిక్కుల‌తో మాట్లాడ‌టం అంద‌రికి అల‌వాటు ఉండ‌దు. చాలామంది నేత‌లు తాము చెప్పాల‌నుకున్న‌ది చెప్పేస్తుంటారే కానీ.. జ‌నాల‌తో ఎంత‌గా క‌నెక్ట్ అవుతామా? అన్న‌ది ఆలోచించ‌రు. కానీ..కొంద‌రు నేత‌ల తీరు అందుకు భిన్నం. తాము మాట్లాడే ప్ర‌తి మాట‌ల్లోఎ లాజిక్ మిస్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా కేసీఆర్‌.. కేటీఆర్.. హ‌రీశ్‌.. రేవంత్ రెడ్డిలు లాంటి వారిని చెప్పొచ్చు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అంత లాజిక్కుల‌తో మాట్లాడినా.. త‌మ ప్ర‌త్య‌ర్థుల మాట‌ల్ని త‌మ‌దైన శైలిలో కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా మాట్లాడ‌టం ఆర్ట్ గా చెప్పాలి.
అలాంటి తీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి మ‌హా స‌ర‌దా. అందునా తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌టంపై ఆయ‌న ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌భుత్వ భూముల్ని అక్ర‌మంగా రిజిస్ట‌ర్ చేసుకున్న ఉదంతంపై మాట్లాడుతూ.. ఈ వ్య‌వ‌హారంలో ఎలాంటి స్కాం జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకున్నారు.

దీనిపై రేవంత్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఎలాంటి అక్ర‌మాలు జ‌ర‌గ‌కుంటే ఒకేరోజు 72 మంది స‌బ్ రిజిస్ట్రార్ల‌ను ఎందుకు బ‌దిలీ చేశారంటూ ప్ర‌శ్నించారు. అంతేకాదు.. రిజిస్ట్రార్ల‌పై ఏసీబీ దాడులు ఎందుకు చేయించారు? అంటూ సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. భూముల వ్య‌వ‌హారంలో టీఆర్ఎస్ నేత‌లు.. మంత్రుల హ‌స్తం లేకుండా తాము అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

భూ కుంభ కోణాన్ని ప్ర‌భుత్వ‌మే బ‌య‌ట‌పెట్టింద‌ని మంత్రి కేటీఆర్ చెబుతున్నార‌ని.. కానీ కుంభ‌కోణ‌మే జ‌ర‌గ‌లేద‌ని.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఒక్క రూపాయి కూడా న‌ష్ట‌పోలేద‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌టం స‌రికాద‌న్నారు. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయ‌ని రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సీఎంవోకు ఫిర్యాదు చేసింద‌ని.. ఆడిట్ యంత్రాంగం ప‌ట్టుకున్న ఈ వ్య‌వ‌హారాన్ని సీఎం తాను బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా చెప్పుకోవ‌టం త‌ప్పు కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వంలోని నేత‌ల స‌హ‌కారంతో ఇంత పెద్ద కుంభ‌కోణం జ‌రిగితే.. స్టాంపు రుసుము ఎగ‌వేత చిన్న అంశంగా చూప‌టం ఏమిటి? అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. త‌న‌దైన శైలిలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న రేవంత్ రెడ్డికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాధానం చెబుతారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News