రేవంత్ వ్యూహం.. కేసీఆర్‌పై ముప్పేట దాడి.. చేతులు క‌లిపిన పార్టీలు

Update: 2021-09-21 00:30 GMT
రాజ‌కీయాలు ఎప్పుడూ న‌ల్లేరుపై న‌డ‌క కానేకాదు. స‌వాళ్లు ఏరూపంలో వ‌స్తాయో..ఎవ‌రూ చెప్ప‌లేరు. నిన్న‌టివ‌ర‌కు ఏం చేస్తాడులే అనుకున్న నాయ‌కులు.. ఒక్క‌సారిగా విజృంభించే ప‌రిస్థితులు రాజ‌కీయాల్లో కామ‌న్‌. ఇప్పుడు ఈ ప‌రిస్థితినే తెలంగాణ ముఖ్య‌మంత్రి.. ఉద్య‌మ సార‌థి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం ఆవిర్భ‌వించిన నాటి నుంచి త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తూ వ‌చ్చారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా వేశారు. అంతేకాదు. తాను త‌ప్ప మిగిలిన వారంతా వేస్ట్ అని ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలోనే 2018లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు, దూకుడుకు చెక్ పెట్టేందుకు.. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లారు. విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక‌, త‌న‌ను ప్ర‌శ్నించేవారు ఎవ‌రూ ఉండ‌ర‌ని అనుకున్నారు. నిజ‌మే! అది ఆరు మాసాల కింద‌టి వ‌ర‌కు! కానీ... త‌ర్వాత‌.. ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల్లో సార‌థులు మార‌డం.. వారు యువ నేత‌లు కావ‌డం.. ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకోవ‌డం.. ప్ర‌భుత్వం నుంచిఏమీ ఆశించ‌క‌పోవ‌డం.. వంటి ప‌రిణామాలు.. కేసీఆర్‌కు ఉలిక్కిప‌డేలా చేశాయి. మ‌రీ ముఖ్యంగా.. కాంగ్రెస్ పార్టీ సార‌థిగా.. రేవంత్‌రెడ్డి నియామ‌కం.. జ‌రిగిన త‌ర్వాత‌.. ముందు.. అన్న రేంజ్‌లో టీఆర్ ఎస్ ప‌రిస్థితి మారిపోయింది. ఆది నుంచి కేసీఆర్‌పై ఒంటికాలిపై లేస్తున్న రేవంత్‌కు.. కాంగ్రెస్ బాధ్య‌త‌లు పూర్తిగా క‌లిసివ‌చ్చాయి. టీడీపీలో ఉన్న‌ప్పుడే.. కేసీఆర్‌పై దూకుడు చూపించిన రేవంత్‌.. ఇప్పుడు మ‌రింత స‌వాళ్లు విసురుతున్నారు.

కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. నాయ‌కుల‌ను ఏక‌తాటిపైకి న‌డిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా.. గ‌ళంగా బాగానే వినిపిస్తున్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని.. పేర్కొంటూ.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుస్తున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షాలు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. తాజాగా బీజేపీ యేత‌ర ప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి తెచ్చి.. కేసీఆర్‌కు మ‌రింత .. షాక్ ఇచ్చేలా.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు రేవంత్‌రెడ్డి. తాజాగా.. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యం.. గాంధీభవ‌న్‌లో జ‌రిగిన బీజేపీ యేత‌ర‌ ప్ర‌తిప‌క్షాల స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

రాష్ట్రంతో పాటు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న ప్రజా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడాల‌ని రేవంత్ నేతృత్వంలో నేత‌లు నిర్ణ‌యించారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జ‌న స‌మితి, తెలంగాణ ఇంటి పార్టీ, న్యూడెమోక్ర‌సీ త‌దిత‌ర పార్టీలు ఈ స‌మావేశంలో పాల్గొని రేవంత్ సార‌థ్యంలో ఉద్య‌మాలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. భూ స‌మ‌స్య‌లు, భూ సేక‌ర‌ణ‌, ధ‌ర‌ణిలో లోపాలు, పోడు భూములు స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంతేకాదు.. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని.. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని కూడా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. సో.. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిస్థితి ఒక ఎత్త‌యితే.. ఇక‌ముందు జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్త‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వ్యూహాల‌కు కేసీఆర్ ఎలాంటి ప్ర‌తివ్యూహాలు వేస్తారో చూడాలి.

ఇదీ షెడ్యూల్‌..
+ ఈ నెల 22న మ‌హా ధ‌ర్నా నిర్వ‌హించాల‌ని ఈ పార్టీలు నిర్ణ‌యించాయి.
+ ఈ నెల 27న రైతు సంఘాలు త‌ల‌పెట్టిన భార‌త బంద్‌లో పాల్గొంటారు.
+ రాష్ట్రంలోని ర‌హ‌దారుల‌ను దిగ్భంధ‌నం చేయ‌నున్నారు.
+ పోడు భూములు స‌మ‌స్య‌పై 400 కిలోమీట‌ర్ల మేర రాస్తారోకో నిర్వ‌హిస్తారు.
+ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌నున్నారు.
Tags:    

Similar News