అభిమానుల మాట‌!.. రేవంత్‌ ను సీఎంను చేస్తాం!

Update: 2017-10-29 04:41 GMT
తెలంగాణ టీడీపీలో కీల‌క రోల్ పోషించిన రేవంత్ రెడ్డి శ‌నివారం ఆ పార్టీకి రాజీనామా స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌కు తండ్రితో స‌మానమ‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, కొంద‌రు టీడీపీ నేతలు ముఖ్యంగా తెలంగాణ టీడీపీ సీనియ‌ర్లు మాత్రం రేవంత్ రెడ్డిపై తీవ్ర‌మైన కామెంట్లు చేశారు. ఇక రేవంత్ ప‌ని అయిపోయింద‌ని - రేవంత్ వేస్ట్ అని - రాజ‌కీయంగా స‌మాధి ఖాయ‌మ‌ని వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్‌ కు టీడీపీ ఎంతో చేసింద‌ని - చిన్న వ‌య‌సులోనే పెద్ద ప‌ద‌వులు ఇచ్చింద‌ని ఇలా ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన రీతిలో వారు స్పందించారు. అయితే, రేవంత్ మాత్రం ఎక్క‌డా సంయ‌మ‌నం కోల్పోకుండా అధినేత బాబుకు గుడ్‌ బై చెప్పి అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్‌ కు అక్క‌డి నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌ కు వెళ్లిపోయారు.

అయితే, టీ టీడీపీ నేత‌లు చెప్పిన‌ట్టు.. రేవంత్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పినా.. ఎక్క‌డా ఆయ‌న‌కు ఫాలోయింగ్‌ లో తేడా రాలేదు. ఏ ఒక్క కార్య‌క‌ర్తా.. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత కూడా రేవంత్‌ కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌క‌పోగా.. తామంతా రేవంత్ వెంట‌నేన‌ని తెగేసి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ‘‘రేవంత్‌ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది మాకు ముఖ్యం కాదు. కొడంగల్‌ అభివృద్ధే మాకు ప్రధానం. ఇప్పటికీ ప్రజలంతా నాయకుడి వెంటే ఉన్నారు. వెనుకబడ్డ కొడంగల్‌ పేరును ఢిల్లీ దాకా తీసుకెళ్లిన రేవంత్‌ ను ఏ పార్టీ సింబల్‌ నుంచైనా గెలిపిస్తాం. మా ప్రాణాలిచ్చైనా ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాం’’ అని అభిమానులు చెప్పుకొచ్చారు. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు.

నిజానికి టీడీపీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామాను ప్రకటించిన తర్వాత తొలిసారి కొడంగల్‌ కు వచ్చిన రేవంత్‌ రెడ్డికి అభిమానులు ఘ‌న స్వాగతం పలికారు. రేవంత్‌ ఇంటివద్ద వందల సంఖ్యలో గుమ్మికూడిన అభిమానులు.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.  అయితే, అప్ప‌టికే స‌మ‌యం చాలా పొద్దు పొవ‌డంతో తనకోసం ఎదురుచూసిన కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు రాత్రైపోయింది. చీకట్లో అందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి. రేపు(ఆదివారం) పొద్దున 9 గంటలకు అన్ని విషయాలు మాట్లాడుతాను. తప్పకుండా అందరూ రండి’’ అని చెప్పారు. దీంతో రేవంత్ అభిమానులు `జై రేవంత్ అన్నా` అనే నినాదాలు చేసుకుంటూ అక్క‌డి నుంచి ఇళ్ల‌కు ప‌య‌న‌మ‌య్యారు. మొత్తానికి రేవంత్ ఫాలోయింగ్ త‌గ్గ‌లేద‌ని చెప్ప‌డానికి ఇదొక నిద‌ర్శ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News