టీ టీడీపీ పగ్గాలు రేవంత్ కేనా?

Update: 2015-09-16 17:30 GMT
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కారణం అధ్యక్షుడి ఎన్నికకు ఆ పార్టీ ఎంచుకున్న విధానమే. పార్టీ అధ్యక్షుడిని ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఎన్నుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణలోని నాలుగున్నర లక్షల మంది కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే ఐవీఆర్ఎస్ ను ప్రారంభించారు కూడా.

తెలంగాణలో ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడేది ముగ్గురు. వారిలో ఒకరు ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే మరొకరు రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్న ఎల్. రమణ కూడా రేసులో ఉన్నారు. తాను సీనియర్ కనక తనకు పగ్గాలు అప్పగించాలని ఎర్రబెల్లి భావిస్తున్నారు. రేవంత్ కు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో బీసీకి చెందిన రమణను పక్కన పెడితే ఆ వర్గానికి ఆగ్రహం వస్తుంది. మరోవైపు, తెలంగాణలో ప్రాబల్య వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలు అప్పగిస్తే.. అది కూడా కాస్త దూకుడుగా వెళ్లే వ్యక్తికి అప్పగిస్తేనే పార్టీ మనుగడ సాగించగలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ అయితేనే మేలు. కానీ, రేవంత్ ను ఏకపక్షంగా ఎంపిక చేస్తే మిగిలిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఐవీఆర్ ఎస్ ద్వారా చేపడుతున్నారని అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలోని టీడీపీ నాయకుల్లో రేవంత్ రెడ్డిపైనా అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎర్రబెల్లికి అధ్యక్ష పదవి ఇవ్వడానికి వారు సుముఖంగా లేరు. ఇక రమణకు అంత పాపులారిటీ కనిపించడం లేదు. ఓటుకు నోటు వ్యవహారం తర్వాత రేవంత్ రెడ్డి పాపులారిటీ భారీగా పెరిగింది. తెలంగాణ టైగర్ అని ఆయనను కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐవీఆర్ ఎస్ లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇక రేవంత్ అధ్యక్షుడు కావడం లాంఛన మేననే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News