రేవంత్ కు కాంగ్రెస్ న‌చ్చ‌ట్లేదా?

Update: 2019-02-06 07:51 GMT
తెలంగాణ‌లో మంచి వాక్చాతుర్య‌మున్న నేత‌ల్లో రేవంత్ రెడ్డి ఒక‌రు. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న తెలంగాణ‌లో టీడీపీ బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్నారు. ఎల్‌.ర‌మ‌ణ‌తో క‌లిసి పార్టీని న‌డిపించారు. అయితే - అధినేత చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా దూర‌మ‌వ్వ‌డంతో తెలంగాణ‌లో టీడీపీ కోలుకోలేక‌పోయింది. చివ‌ర‌కు ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది టీడీపీ.

తెలంగాణ‌లో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు కుద‌ర‌డంలో రేవంత రెడ్డి పాత్ర చాలా కీల‌కం. రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా మార‌డాన్ని గ్ర‌హించిన ఆయ‌న ముందే కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్‌ లో తొలుత కీల‌క బాధ్య‌త‌లు ద‌క్క‌క‌పోయినా.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఆయ‌న ధాటిని గ్ర‌హించిన అధిష్ఠానం ఎట్ట‌కేల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వితో గౌర‌వించింది. ఆపై టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ టీఆర్ ఎస్ పై ధ్వ‌జమెత్తారు.

రేవంత్ - ఇత‌ర కాంగ్రెస్ -టీడీపీ పెద్ద‌లు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. టీఆర్ ఎస్ అఖండ విజ‌యంతో తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టింది. కాంగ్రెస్ లో ప‌లువురు అతిర‌థ మ‌హార‌థులు ఓట‌మి పాలయ్యారు. చివ‌ర‌కు కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి కూడా ప‌రాజ‌యం చ‌విచూశారు. ఓట‌మి త‌ర్వాత ఆయ‌న బాగా సైలంట‌య్యారు.

తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీపీసీసీ నేత‌ల‌ను పిలిపించి మాట్లాడారు. తెలంగాణ‌లో త‌మ ఓట‌మికి దారితీసిన ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఓట‌మిపై రాహుల్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. నువ్వెలా ఓడిపోయావ్ అంటూ రేవంత్ ను ప్ర‌శ్నించారు. రాహుల్ ప్ర‌శ్న‌కు రేవంత్ ఇచ్చిన స‌మాధానం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

ధన ప్రవాహం - అధికార దుర్వినియోగం ద్వారా టీఆర్ ఎస్ త‌న‌ను ఓడించింద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. చివరి రోజుల్లో ప్రచారానికి తాను తగిన సమయం కేటాయించలేకపోయాన‌నీ తెలిపారు. అందుకే ఓట‌మి పాల‌య్యాన‌ని చెప్పారు. అయితే - రేవంత్ అక్క‌డితో ఆగ‌లేదు. తెలంగాణ‌లో పార్టీ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను పార్టీలోకి వచ్చి ఏడాది దాటిందని గుర్తుచేశారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో ఏ స‌మ‌స్య‌పై కూడా కాంగ్రెస్ ఆందోళ‌న చేసిన దాఖ‌లాలే లేవ‌న్నారు. పోరాట కార్య‌క్ర‌మాల్లో పార్టీ వైఫ‌ల్యం చెందింద‌ని తెలిపారు. ప్రజలకు దగ్గరయ్యే ఉద్యమాలు చేపట్టడం లేద‌ని పెద‌వి విరిచారు. అందువ‌ల్లే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలయ్యామ‌ని చెప్పారు.

రేవంత్ మాట్లాడిన తీరు చూస్తుంటే కాంగ్రెస్ లో చేరిక‌పై ఆయ‌న ఎంత‌మాత్ర‌మూ సంతృప్తిగా లేర‌ని తెలుస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌దామంటూ ఆయ‌న గ‌తంలో చెప్పినా టీపీసీసీలోని పెద్ద‌లు పెడచెవిన పెట్టి ఉంటార‌ని.. అందుకే ఆయ‌న అంత ఆవేద‌న‌తో మాట్లాడి ఉండొచ్చ‌ని విశ్లేషించారు. కాంగ్రెస్ తీరు రేవంత్ కు న‌చ్చ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న మాట‌ల‌తో ఇక‌పైనైనా క‌ళ్లు తెరిచి ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌క‌పోతే తెలంగాణ‌లో కాంగ్రెస్‌ పూర్తిగా క‌నుమ‌రుగై పోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు.


Tags:    

Similar News