రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ ఒకే స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా?

Update: 2022-01-31 09:43 GMT
టీఆర్ఎస్ ఆధిప‌త్యంతో సాగుతున్న తెలంగాణ రాజ‌కీయాల‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చింది ఎవ‌రంటే? క‌చ్చితంగా రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ పేర్లు వినిపిస్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్‌, తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి.. అధికార టీఆర్ఎస్‌కు స‌వాలు విసురుతున్నారు.

రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోటీకి తెర‌తీశారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ బాధ్య‌త‌లు తీసుకున్న తర్వాత పార్టీ ప‌రుగులు పెడుతోంది. మ‌రోవైపు గ‌తేడాది టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్‌.. సీఎం కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారారు. కానీ ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు ఒకే స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తున్నారు.

ఆ స్థాయికి..
కాంగ్రెస్ పార్టీలో జూనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ రేవంత్‌కు టీపీసీసీ ప‌ద‌వి ద‌క్కింది. త‌న దూకుడైన రాజ‌కీయాలే అందుకు కార‌ణం. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా సంజ‌య్ కూడా జోరు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ ఇద్ద‌రు కొత్త‌గా ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లోనే తొలిసారి పార్ల‌మెంటు స‌భ్యులుగా గెలిచారు. ఈ ఇద్ద‌రూ ఫైర్‌బ్రాండ్లే. మాట‌ల యుద్ధంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌రు.

కేసీఆర్‌ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌ల దాడి చేయ‌డంలో ఈ ఇద్ద‌రూ ముందుంటారు. అయితే రేవంత్‌కు మాత్రం గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. కానీ సంజ‌య్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ అసెంబ్లీకి వెళ్ల‌లేక‌పోయారు. ఇక రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఈ ఇద్ద‌రు నేత‌లు.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాల‌తో త‌మ త‌మ పార్టీల‌ను రాష్ట్రంలో న‌డిపించే స్థాయికి ఎదిగారు.

ఆ స‌మ‌స్య‌..
రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ర‌థ సార‌థులుగా సాగుతున్న రేవంత్‌, సంజ‌య్‌కు ఆయా పార్టీల్లోని సీనియ‌ర్ల నుంచి త‌గిన మ‌ద్ద‌తు లేదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రేవంత్‌పై పార్టీ సీనియ‌ర్ల అసంతృప్తి బ‌హ‌రంగంగానే ఎన్నోసార్లు బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న తీరుపై కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు త‌న సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌లోనే సొంత పార్టీ నుంచి అసంతృప్తి ఎదుర‌వుతోంది.

ఇటీవ‌ల ఆ పార్టీలోని కొంత‌మంది నేత‌లు బండి సంజ‌య్ వ‌ర్గానికి వ్య‌తిరేకంగా ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించిన విష‌యం సంచ‌ల‌నంగా మారింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ బ‌లం ఉన్న కాంగ్రెస్‌.. బీజేపీ కంటే బలంగా క‌నిపిస్తోంది. బీజేపీకి కేవ‌లం న‌గ‌రాల్లోనే ప‌లుకుబ‌డి ఉంది. అది కూడా ప‌రిమిత సంఖ్య‌లోనే అని విశ్లేష‌కులు అంటున్నారు.

అయిన‌ప్ప‌టికీ గ‌త కొంత‌కాలంగా బీజేపీ బ‌లంగా పుంజుకుంది. అధిష్టానం కూడా రాష్ట్ర నాయ‌క‌త్వానికి పూర్తి అండ‌దండ‌లు అందిస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ త‌మ‌కున్న క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తోంది. వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో త‌మ పార్టీల‌కు మెరుగైన ఫ‌లితాలు అందించాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్న రేవంత్‌, సంజ‌య్ ముందు పార్టీలోని అసంతృప్తిపై దృష్టి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.    


Tags:    

Similar News