పెరుగుతున్న కోవిడ్ కేసులపై ‘సీరం’ సీఈవో ఏమన్నారంటే?

Update: 2022-12-21 14:57 GMT
మన పొరుగున ఉన్న చైనాలో రోజురోజుకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో గత 15 రోజులుగా కేసుల సంఖ్య లక్షల్లో నమోదు అవుతుంది. కరోనా పేషంట్లతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు నెలలు చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2023 ఏడాదిలో ఏప్రిల్ నాటికి చైనాలో 10 లక్షల మంది మృతి చెందుతారని అమెరికా సైతం ఇటీవల అంచనా వేసింది. కరోనా కేసులపై చైనా అధికారిక లెక్కలకు అసలు కరోనా కేసులకు పొంతన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించడానికి సైతం చోటు దొరకని పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో భారత్ మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా తాజాగా వ్యాఖ్యానించారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ అద్భుతమైన వ్యాక్సినేషన్ ప్రగతిని సాధించిందని ఆయన తెలిపారు.

కరోనా విషయంలో భారతీయులు ఆందోళన చెందనక్కరలేదని.. అయితే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖ మార్గ దర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాగా కరోనాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేసిన సీరం ఇన్ స్టిట్యూట్ కు పూనావాలా సీఈవోగా ఉన్నారు.

మరోవైపు హంగ్ కాంగ్ కథనం ప్రకారం.. చైనాలో లెక్కకు మించి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనా మాత్రం రోజుకు 2 వేల కేసులే నమోదు అవుతున్నట్లు అధికారికంగా వెల్లడిస్తుందని పేర్కొన్నారు. చైనాలో కరోనా కేసులపై భారత మాజీ రాయబారి కేపీ ఫెబియన్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా చైనాలోనే ఉందన్నారు.

చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో 60శాతం మంది ప్రజలు కరోనా బారిన పడనున్నారని తెలిపారు. వీరిలో లక్ష మంది వరకు మృతి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కోవిడ్ తో పోరాటం విషయంలో వ్యాక్సినేషన్ విషయంలో ఎక్కడో పొరపాటు చేసి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

చైనా సర్కారు మెరుగైన వ్యాక్సిన్ తెప్పించునేందుగానీ.. సొంత వ్యాక్సిన్ లో మార్పులు చేయడం గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నారు. దీంతోనే అక్కడ కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా చైనాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News