ఆర్కేన‌గ‌ర్ ఆరాచకానికి 33 పేజీలు ప‌ట్టాయి

Update: 2017-04-11 03:34 GMT
స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎన్నిక‌లు ఎంత ఫార్సుగా మారింది తెలిసిందే. కొన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క ఎన్నిక‌ల విష‌యంలో అభ్య‌ర్థులు ఎంత భారీగా ఖ‌ర్చు పెడుతున్నది తెలిసిందే. కానీ.. వాట‌న్నింటిని త‌ల‌ద‌న్నేలా చేసింది ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌.దివంగ‌త అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ కు ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు నోటిఫికేష‌న్ జారీ చేయ‌టం తెలిసిందే. అమ్మ స్థానాన్ని చేజిక్కించుకోవ‌టం కోసం అమ్మ‌పార్టీకి చెందిన వారు.. ఆమె వైరి వ‌ర్గం వారు క‌దిపిన పావులు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా రెండు ముక్క‌లైన అమ్మ పార్టీలోని రెండు వ‌ర్గాలు.. ఆర్కేన‌గ‌ర్ సీటును త‌మ సొంతం చేసుకోవ‌టానికి ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది.

దీంతో.. ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల ఆరాచ‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ గా..ప్ర‌లోభాల‌కు ప‌ర్యాయ‌ప‌దంగా మారింది. ఓట‌ర్ల‌నుఆక‌ట్టుకోవ‌టానికి ఇక్క‌డి నేత‌లు.. పార్టీలు అనుస‌రించిన తీరు గురించి ఎన్నిక‌ల సంఘం నోట్ ప్రిపేర్ చేస్తే.. అది ఏకంగా 33 పేజీలు అయ్యాయ‌ని.. ఓట‌ర్ల‌ను వినూత్న మార్గాల ద్వారా ప్ర‌లోభానికి గురి చేసిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

ఇష్టారాజ్యంగా మారిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తూ త‌యారు చేసిన అధికారిక ప‌త్రంపై ముగ్గురు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు సంత‌కం చేయ‌టం గ‌మ‌నార్హం.  వినూత్న ప‌ద్ద‌తిలో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టార‌ని.. ఇందుకోసం రాజ‌కీయ పార్టీలు ఊహించ‌ని రీతిలో ప‌లు విధానాల్ని అనుస‌రించిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం అభిప్రాయ ప‌డింది.ఎన్నిక‌ల వ్య‌య ప‌రిమితుల ప‌రిధిలోకి రాకుండా స‌రికొత్త ప‌ద్థ‌తుల్లో డ‌బ్బునుపంపిణీ చేయ‌టం ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక స్పెషాలిటీగా చెబుతున్నారు.

ప్ర‌లోభాల ప‌ర్వం పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వానికి తెలిసే జ‌రిగాయ‌ని.. వారికేమీ తెలీద‌న్న‌ట్లుగా చెప్ప‌లేమ‌ని వారు తేల్చి చెప్పేశారు. ఏప్రిల్ ఏడో తేదీ వ‌ర‌కూ.. రూ.18.80ల‌క్ష‌లు ప‌ట్ట‌బ‌డ్డాయ‌ని.. మొత్తం35 కేసులు న‌మోదు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. ఓట‌ర్ల‌ను.. కార్య‌క‌ర్త‌ల్ని వినూత్న రీతిలో ప్ర‌లోభ పెట్టిన విధానాల్ని ఎన్నిక‌ల సంఘం గుర్తించింది.

దీని ప్ర‌కారం.. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు ఆక‌ర్షించ‌టానికి.. న‌గ‌దు.. బ‌హుమ‌తులు.. ఎక్క‌డైనా కొనుగోలు చేసుకోవ‌టానికి వీలుగా టోకెన్లు.. సెల్ ఫోన్ ప్రీపెయిన్ కూప‌న్లు.. దిన‌ప‌త్రిక‌ల చందాలు.. పాల ప్యాకెట్ల కొనుగోలుకూప‌న్లు.. వ్యాలెట్ పేమెంటు ద్వారా న‌గ‌దు పంపిణీ.. బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌టం లాంటివి చేస్తే.. కార్య‌క‌ర్త‌ల విష‌యానికి వ‌స్తే.. వారికి.. డ‌బ్బులు.. చీర‌లు.. సెల్ ఫోన్లు.. టీ ష‌ర్ట్ లు.. ఖ‌రీదైన వ‌స్తువులు.. బ‌హుమ‌తులు.. వెండిప‌ళ్లాలు లాంటివి అంద‌జేసిన‌ట్లుగా గుర్తించారు.
Tags:    

Similar News