కొత్త చరిత్ర.. రోహిత్ మూడో డబుల్ సెంచరీ

Update: 2017-12-13 11:03 GMT
వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడమే ఒక అద్భుతం. ఆ ఘనతను ఒకటికి రెండుసార్లు అందుకుని చరిత్ర సృష్టించిన ఆటగాడు రోహిత్ శర్మ. ఇప్పుడతను ఏకంగా మూడో డబుల్ సెంచరీ కొట్టేశాడు. శ్రీలంకతో మొహాలీ జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌గా బరిలోకి తొలి బంతిని ఎదుర్కొన్న రోహిత్.. చివరి దాకా అజేయంగా నిలిచాడు. అతను 153 బంతులెదుర్కొని 208 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌ లో 13 ఫోర్లు - 12 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఫోర్లు - సిక్సర్లతోనే అతను 124 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌ లో 50 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మరో ఓపెనర్ ధావన్ 68 పరుగులకు ఔటవగా.. మూడో స్థానంలో వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 88 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ లో భారత జట్టుకు కెప్టెన్ కూడా అయిన రోహిత్.. తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ లో నెమ్మదిగా.. బాధ్యతాయుతంగా ఆడే ప్రయత్నం చేశాడు. అతను 65 బంతుల్లో అర్ధసెంచరీ.. 115 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐతే సెంచరీ తర్వాత రోహిత్ అనూహ్య రీతిలో చెలరేగిపోయాడు. ఇంకో 36 బంతుల్లోనే రెండో సెంచరీ కొట్టేసి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతికి రోహిత్ ద్విశతకం పూర్తయింది. రోహిత్ 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (209) చేశాడు. తర్వాతి ఏడాదే శ్రీలంక జట్టుపై 264 పరుగుల ఇన్నింగ్స్‌ తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ వన్డేల్లో అదే అత్యధిక స్కోరు. భారత్ తరఫున సచిన్ - సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News