ప్రపంచకప్.. ఆ రికార్డు మాత్రం ఇండియన్ కే సొంతం!

Update: 2019-07-15 04:53 GMT
ఏడు వారాల ప్రపంచకప్ ముగిసింది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రికెట్ ఈవెంట్ ఈ సారి కూడా క్రికెట్ ఫ్యాన్స్ ను అమితంగా అలరించింది. విజేతగా నిలిచింది ఎవరైనా ప్రపంచకప్ నాకౌట్ దశ మ్యాచ్ లు మాత్రం అత్యంత ఆసక్తిని రేపాయి. అందులోనూ ఈ సారి కొత్త జట్టు విజేతగా ఆవిర్భవించడం గమనార్హం.

ఇక ప్రపంచకప్ లో భారత జట్టు కూడా మెరుగైన ప్రదర్శనే చేసింది. సెమిఫైనల్ వరకూ వెళ్లింది. ఆ మ్యాచ్ లో ఓడిపోయినా అద్భుతమైన పోరాటపటిమ చూపింది భారత జట్టు. ఎవరు గెలిచారనేది కాదు, అద్భుతమైన ఆట మాత్రం ప్రదర్శితం అయ్యింది. ఇక పాయింట్ల టేబుల్ లో కూడా టీమిండియా నంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. కేవలం అరగంట సేపు మాత్రమే తాము సరిగా ఆడలేదని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని టీమిండియా ఆటగాళ్లు వాపోయారు.

ఇక వ్యక్తిగత ప్రదర్శనలో కూడా టీమిండియా ఆటగాళ్లు మంచి పొజిషన్లో నిలిచారు. ఈ ప్రపంచకప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ నిలిచిన రోహిత్ ఆరు వందల నలభై ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ - న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ లు కూడా కొంతమంది సత్తా చూపినా ఎవరూ రోహిత్ ను అందుకోలేకపోయారు. ప్రపంచకప్ లో భారత జట్టు విజేతగా నిలవకపోయినా టాప్ స్కోరర్ గా నిలవడం మనోళ్లకు కొత్త కాదు.

గతంలో రెండు వేలా మూడు వరల్డ్ కప్ లో కూడా సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఆ వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ లో ఓటమి పాలైంది. అప్పుడు సచిన్ మ్యాన్ ఆఫ్  ద టోర్నీగా నిలిచాడు.
ఇక ఈ సారి టాప్ స్కోరర్ ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కింది.
Tags:    

Similar News