కోహ్లి సెంచరీలో రోహిత్ పాత్ర.. జంటగా ఇంటర్వ్యూలో

Update: 2022-09-10 14:30 GMT
టి20 అంటేనే కుర్రాళ్ల ఆట.. అందులోనూ ఎన్ని భిన్నమైన షాట్లు కొడితే అంత పాపులర్.. ఉదాహరణకు ఏబీ డివిలియర్స్ నే చూడండి.. అటు క్లాస్ ఇటు మాస్ రెండింటినీ కలగలిపి కొట్టగల 360 డిగ్రీ ఆటగాడతను. టెస్టుల్లో ఎంత సాధికారికంగా ఆడగలడో.. టి20ల్లో అంతే భిన్నమైన షాట్లు కొట్టేవాడు. అయితే, టి20ల్లో పరుగులు పిండాలంటే సిక్సులే మార్గం.

బ్యాట్స్ మన్ కొట్టిన బంతి స్టాండ్స్ లో పడితే బౌలర్ ఆత్మవిశ్వాసం అమాంతం పడిపోతుంది. అందుకే.. పొట్టి ఫార్మాట్ లో బుద్ధి బలం కంటే భుజ బలం ఉన్న బ్యాట్స్ మన్ దే హవా. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం టి20ల్లో సిక్సులు కొట్టడం తనకు ప్రామాణికం కాదంటున్నాడు. అంతేకాదు.. గురువారం అఫ్గానిస్థాన్ తో ఆసియా కప్ మ్యాచ్ లో సెంచరీ అనంతరం అతడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఉందని చెబుతున్నాడు. రోహిత్ సహకారంతోనే తన సెంచరీ సాధ్యమైందని అంటున్నాడు.

ఔను రోహిత్ పాత్ర.. ప్రత్యక్షంగా పరోక్షంగా

రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు.. మూడేళ్లుగా ప్రజల్లో, అభిమానుల్లో నానుతున్న అంశం ఇది. దీనికితగ్గట్లే కోహ్లి ఏకాగ్రత చెదిరింది. మూడేళ్లుగా సెంచరీనే కరవైంది. ఏడాదిగా ఫామ్ మరింత పడిపోయింది. 2022 అయితే అతడికి చాలా దుర్భరంగా గడిచింది. అసలు జట్టులో చోటు ఉంటుందా? అన్నంతగా పరిస్థితి మారింది. కానీ, గురువారం అఫ్గాన్ తో మ్యాచ్ ద్వారా దాన్నంతటినీ కోహ్లి అధిగమించాడు. అఫ్గాన్ పై అజేయ శతకంతో (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్)తో చెలరేగిన కోహ్లి.. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి చిట్ చాట్ గా సంభాషించాడు. బీసీసీఐ ఈ వీడియోను ట్వీట్ చేసింది.

కాగా, ఈ మ్యాచ్ కు రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ తో కలిసి కోహ్లి ఓపెనింగ్ కు దిగాడు. అలా రావడం వల్లే ఎక్కువ బంతులు ఆడే అవకాశం చిక్కింది. అంతేకాక.. ఒకవేళ రోహిత్ ఆడి ఉంటే కచ్చితంగా 30 బంతులైనా ఆడగలిగేవాడు. తద్వారా కోహ్లి సెంచరీకి పెద్దగా ఆస్కారం ఉండేది కాదు. ఇక  ఆసియా కప్ నకు ముందు కోహ్లి గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా నెల రోజులు అసాధారణ విరామం తీసుకున్నాడు. ఆ వ్యవధిలో తను బ్యాట్ కూడా పట్టలేదు. దీంతో కుంగుబాటుకు దగ్గరగా వెళ్లినట్లు స్వయంగా చెప్పాడు. అయితే, విశ్రాంతి తర్వాత తాజాగా బరిలో దిగిన కోహ్లి అందుకుతగ్గట్లుగా రాణించాడు. ఆసియా కప్ లో అత్యధిక పరుగుల వీరుడిగా
నిలిచాడు.

కోహ్లి.. నువ్వు కావాలి : రోహిత్

హిట్టింగ్ కు మారుపేరైన టి20ల్లో.. హిట్ మ్యాన్ గా పేరున్న రోహిత్ శర్మ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. విరాట్ ఫామ్‌ జట్టుకు చాలా అవసరమని, ఎక్కువగా భారీ షాట్లకు వెళ్లకుండా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు జట్టుకిది శుభసూచకమని చెప్పాడు.'మేం టీ20 ఫార్మాట్ అనగానే ధాటిగా ఆడటం ముఖ్యం అనుకున్నాం. కానీ విరాట్ మాకు మరో కోణం చూపించాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా ధాటిగా ఆడవచ్చని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం ఎంత అవసరమో అనే విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా మాకు చూపించాడు' అని అన్నాడు.

ఇక రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు అందించిన సహకారం గురించి విరాట్ ప్రత్యేకంగా మాట్లాడాడు. 'సూపర్‌- 4లో పాకిస్థాన్‌, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో ఎక్కడ తప్పులు చేశామో తెలుసుకుని, పాఠాలు నేర్చుకుంటాం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి నాకెప్పుడూ స్పష్టమైన సమాచారం ఉంది. నువ్వు (రోహిత్‌) ఇచ్చిన విరామం కారణంగా ఉపశమనం పొందా. మంచి క్రికెట్‌ షాట్లపైనే ఆధారపడ్డా. సిక్సర్లు కొట్టడం నా బలం కాదు. పరిస్థితులు డిమాండ్‌ చేస్తే బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తా. కానీ ఖాళీలు చూసి ఫోర్లు రాబట్టడంలోనే నేను మెరుగు. అలా బౌండరీలు కొడుతున్నంత సేపు జట్టు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నట్టే. కోచ్‌లకు కూడా భారీ షాట్లు ఆడడం కంటే కూడా ఖాళీలు చూసి బ్యాటింగ్‌ చేస్తానని చెప్పా''అని కోహ్లి  తెలిపాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News