రోజా విసుర్లు మొదలయ్యాయి

Update: 2016-03-18 05:47 GMT
అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు కానీ అప్పుడే రోజా విసుర్లు మొదలయ్యాయి. తూటాల్లాంటి మాటలు.. అవసరమైతే ఎంతవరకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే రోజా నోటి మాటల తీవ్రత ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటి ఆమె.. తాజాగా పొందిన కోర్టు ఉత్తర్వులతో  అసెంబ్లీలోకి వెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఆమెను అనుమతించొద్దంటూ ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి చీఫ్ మార్షల్ కు ఆదేశాలు అందిన నేపథ్యంలో ఆమెను లోపలికి అనుమతించకపోవటం ఇప్పుడో వివాదంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యాయవ్యవస్థను గౌరవించని ఏపీ సీఎం డౌన్.. డౌన్ అంటూ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మీడియాతో మాట్లాడిన రోజా తనదైన శైలిలో ఏపీ సర్కారుకు కౌంటర్ ఇచ్చారు. తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ టీడీపీ సర్కారు నిర్ణయం తీసుకుందని.. ఇదంతా ఆవేశంతో తీసుకున్న నిర్ణయమని.. అలాంటి నిర్ణయాన్ని కోర్టు ఆదేశాలతో సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనలన్నీ తెలిసిన యనమలతోపాటు.. ఏపీ అసెంబ్లీలో చదువుకున్న వాళ్లు చాలామందే ఉన్నారని.. హైకోర్టు ఉత్తర్వులో తాను ఏపీ అసెంబ్లీకి హాజరు కావటానికి అనుమతులు ఉన్నాయని.. తనను అనుమతించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టక ముందే ఏపీ అధికారపక్ష నేతలపై రోజా విసుర్లు వేస్తున్న నేపథ్యంలో.. ఆమె కానీ సభలోకి అడుగు పెడితే మరింత విసుర్లు.. రోజా మార్క్ చురకలు పక్కా అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News