రోజా కామెంట్‌ తో బాబు నోట మాట‌లేదే!

Update: 2017-09-06 10:51 GMT
ప్ర‌జ‌ల‌కు నీతులు చెప్పేట‌ప్పుడు.. తాను కూడా పాటించాలి.  ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న వారు, పెద్ద పెద్ద ప‌దవులు అనుభ‌విస్తున్న వారు అయితే.... త‌ప్ప‌కుండా దీనిని పాటిస్తేనే వారికి విలువ‌. గౌర‌వం. కానీ ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల‌కు, చేస్తున్న ప‌నుల‌కు అస్స‌లు పొంత‌నే ఉండ‌డం లేదన్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌జ‌లకు నీతులు చెప్పే ఆయ‌న చేస్తున్న ప‌నుల‌న్నీ బ్యాడ్‌ గానే ఉంటున్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు - న‌గ‌రి ఎమ్మెల్యే రోజా.  ప‌ది మందికి నీతులు చెప్పే ముందు, వాటిని పాటించాల‌ని సూచించే ముందు బాబు ఎంత వ‌ర‌కు ఈ నీతులు పాటించారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాభా భారీ సంఖ్య‌లో పెరిగిపోతోంది. చైనాలో అయితే 135 కోట్ల‌కు పైగా జ‌నాభా పెరిగి ప్ర‌పంచంలోనే అతి ఎక్కువ మంది జ‌నాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. మ‌న దేశంలోనూ 125 కోట్ల కు చేరారు జ‌నాలు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కుటుంబ నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా రెండు కొత్త కుటుంబ నియంత్ర‌ణ ప‌ద్ధ‌తుల‌ను సైతం అమ‌ల్లోకి తెచ్చింది. ఎలాగైనా 2025 నాటికి... అంటే రాబోయే ఆరేడేళ్ల‌లో దేశ జ‌నాభాను త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది.

అయితే, దీనికి భిన్నంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు.. జ‌నాభా పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నండి వారికి అవ‌కాశాలను నేను చూస్తాను అంటూ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. ఇప్పుడు ప‌ని క‌ట్టుకుని అధికారుల‌కు కూడా ఈ ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నాయి అమ‌రావ‌తి వ‌ర్గాలు.  సాఫ్ట్ వేర్ త‌దిత‌ర వృత్తుల్లో ఉన్న ఉద్యోగులు పిల్ల‌ల‌ను క‌న‌డం త‌గ్గించేశార‌ని, వారిని మోటివేట్ చేయాల‌ని కూడా బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న *పిల్ల‌ల‌ను క‌నండి... జ‌నాభాను పెంచండి* అనే నినాదం ఎత్తుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

స‌రిగ్గా ఈ కామెంట్‌తోనే వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు బాబు. జ‌నాల్ని పిల్ల‌లు క‌న‌మ‌ని చెబుతున్న బాబు.. తాను చేసింది ఏమిట‌ని?  ఈ నీతులు బాబు కుటుంబానికి వ‌ర్తించ‌వా? అ ని రోజా ప్ర‌శ్నిస్తున్నారు. బాబు  త‌న ఫ్యామిలీని ఒక్క లోకేష్‌తోనే ఎందుకు ఆపేయాల్సి వ‌చ్చిందో చెప్పాల‌ని తాజాగా మీడియా ముఖంగా బాబును నిల‌దీశారు. అదేవిధంగా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తులు కూడా ఒక్క సంతానానికే ఎందుకు ప‌రిమితం అయిపోయార‌ని ప్ర‌శ్నించారు.

జ‌నాల‌కు హిత బోధ చేసేముందు బాబు త‌న కుటుంబంలో దానిని  పాటించి ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు నీతులు చెప్పాల‌ని రోజా అన్నారు. లోకేష్‌ తో ఓ న‌లుగురు పిల్ల‌ల్ని క‌నిపించిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు పిల్ల‌ల్ని క‌నాల‌నే సూక్తులు వివ‌రించాల‌ని రోజా అన్న డైలాగుతో ఇప్పుడు బాబు నోటికి తాళం ప‌డింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ముఖ్యంగా రోజా ఎలాంటి కామెంట్ చేసినా ఒంటి కాలిపై విరుచుకుప‌డే.. నేత‌లు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు?  నిజ‌మే క‌దా?  బాబు నోటికి రోజా భ‌లేగా తాళం వేశారే!!


Tags:    

Similar News