పిల్లలకి బువ్వ పెట్టటానికి బాబు దగ్గర డబ్బుల్లేవా?

Update: 2017-03-15 17:05 GMT
అధికారం చేతికి ఇస్తే చాలు.. కొండ మీద కోతిని సైతం కిందికి తీసుకు వస్తానని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారం చేతికి వచ్చాక చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో మూడు నెలలు అయితే.. బాబు పవర్ లోకి వచ్చి మూడేళ్లు నిండిపోతాయి. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని చెప్పిన చంద్రబాబు.. గడిచిన మూడేళ్ల కాలంలో  ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికి తెలిసిందే. అంతేనా.. తాను పవర్ లోకి వస్తే అన్నదాతలకు రుణమాఫీ చేస్తానని..డ్వాక్రా సంఘాల అప్పుల్ని తీర్చేస్తానని.. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేస్తానని.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని.. ఇలా ఒకటేమిటి.. సమస్తం తీసికొచ్చి ఓటర్ల పాదాల కింద పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు ఏం చెబుతున్నారో.. ఇప్పటి వరకూ ఏం చేస్తున్నారో తెలిసిందే.

తాజాగా ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన యనమల రామకృష్ణుడు ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేశారనే చెప్పాలి. అంకెల గారడీ తప్పించి ఇంకేమీ లేదన్నట్లుగా బడ్జెట్ ఉందని చెప్పక తప్పదు. బడ్జెట్ లోని అంశాల్ని పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఫైర్ బ్రాండ్ రోజా.. బడ్జెట్ మీదా.. చంద్రబాబు పాలనను ఉతికి ఆరేశారు.

ఏదో విమర్శించాలి కాబట్టి.. విమర్శించినట్లు కాకుండా..  ఆమె ప్రస్తావించిన అంశాల్ని చూసినప్పుడు బాబు సర్కారు వైఫల్యం ఇట్టే అర్థమవుతుంది. ఏపీ రాష్ట్రంలో మహిళలు.. శిశువులు.. వృద్ధులు.. వికలాంగులు 70 శాతం మంది ఉంటే.. వారికి కేటాయించిన నిధులు మాత్రం స్వల్పంగా ఉండటాన్ని రోజా తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల వేళ.. చాలా చేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తానిచ్చిన హామీల్ని పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు.. వృద్ధులకు.. శిశువులకు కేటాయించిన కేటాయింపులు కేవలం రూ.1750 కోట్లు మాత్రమేనని.. మొత్తం జనాభాలో 70 శాతం మంది ప్రజలు ఉంటే.. ముష్టి వేసినట్లుగా ఈ నిధుల కేటాయింపు ఏమిటని ప్రశ్నించారు.

బాబు చేసే దుబారా ఖర్చులకు.. హెలికాఫ్టర్లకు.. స్పెషల్ ఈవెంట్లకు.. చంద్రబాబు సతీమణి ఉండేఫైవ్ స్టార్ హోటళ్ల ఖర్చులకు కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టే చంద్రబాబు చిన్నపిల్లల బాలామృతానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉండటం శోచనీయమన్నారు. నిరుద్యోగ భృతికి నిధులు లేవనే వారు.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి కోట్లాది రూపాయిలు ఎక్కడి నుంచి తెస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

ఎన్నికల సందర్భంగా బాబు ఇచ్చిన గుర్తుల్నిమర్చిపోతున్నారని.. ఆయన గజనీలా మారుతున్నారంటూ దుయ్యబట్టిన రోజా.. గజనీ మాదిరి తానిచ్చిన హామీల్నిపచ్చబొట్టుతో బాబు తన ఒంటి మీద పొడిపించుకుంటే మంచిదని మండిపడ్డారు. రోజా విమర్శలన్నీ విన్నాక.. బడ్జెట్ కేటాయింపుల్లో బాబు సర్కారు చేసిన తప్ప స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News