రోజా ప్ర‌శ్నాస్త్రాల‌కు పోలీసుల వ‌ద్ద ఆన్స‌ర్ ఉందా?

Update: 2017-02-24 09:33 GMT
వైసీపీ కీల‌క నేత‌, ఆ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా... చంద్ర‌బాబు స‌ర్కారు,  ఏపీ పోలీసుల తీరుపై మొద‌లెట్టిన పోరును మ‌రింత‌గా ఉధృతం చేసేశారు. మొన్న‌టి మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సుకు బ‌య‌లుదేరిన రోజాను పోలీసులు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని, బ‌ల‌వంతంగా హైద‌రాబాదు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన ప‌లు నాట‌కీయ ప‌రిణామాల‌పై రోజా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చుతూ చంద్ర‌బాబు స‌ర్కారు, పోలీసులు త‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు, డీజీపీ సాంబ‌శివ‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అప్పుడే ఘాటుగా స్పందించారు.

ఆ వ్యాఖ్య‌ల‌పై నిన్న పోలీసు అధికారుల సంఘం కాస్తంత ఆల‌స్యంగా స్పందించినా... రోజా క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేసింది. అంతేకాకుండా డీజీపీపై చేసే వ్యాఖ్య‌ల విష‌యంలో రోజా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, లేని ప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కూడా హెచ్చ‌రించింది. అదే స‌మ‌యంలో డీజీపీ ప‌ట్ల రోజా వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆమె వ‌ద్ద ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్లు న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెల‌పాల‌ని ఆ సంఘం కోరింది. ఈ వ్యాఖ్య‌ల‌పై నేటి ఉద‌యం రోజా చాలా వేగంగానే కాకుండా... ఘాటుగానూ స్పందించారు.

డీజీపీ ప‌ట్ల త‌న వైఖ‌రిని ప్ర‌శ్నించే ముందు.. త‌న ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును సంఘం నేత‌లు గుర్తు చేసుకోవాల‌ని ఆమె కోరారు. అంతేకాకుండా డీజీపీపై తాను మాట్లాడిన‌ప్పుడు మాత్ర‌మే రంగంలోకి దిగిన పోలీసు అధికారుల సంఘం నేత‌లు... సీఎం హోదాలో చంద్ర‌బాబు పోలీసుల‌పై నింద‌లు వేసిన‌ప్పుడు, టీడీపీ ఎమ్మెల్యేగానే కాకుండా... ప్ర‌భుత్వ విప్ హోదాలో ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఏకంగా పోలీసుల‌పై దాడి చేసిన‌ప్పుడు ఈ పోలీసు అధికారుల సంఘం ఎక్క‌డుంద‌ని, ఏమైపోయింద‌ని రోజా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

మీడియా ముందు రోజా చేసిన కామెంట్ల విష‌యానికి వ‌స్తే... ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ప‌నిచేయాల్సి వ‌స్తుంద‌ని పోలీసు అధికారులు చెప్ప‌డం బాధాక‌రం. న‌న్ను క్ష‌మాప‌ణ అడిగే ముందు పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును గుర్తు చేసుకోవాలి. గ‌న్‌మ‌న్ల‌ను న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెల‌ప‌మ‌ని చెప్ప‌డం కాదు. సీఎం ఇంటి ద‌గ్గ‌ర వ‌స‌తులు లేక మ‌గ్గుతున్న పోలీసులు నిర‌స‌న తెలపాలి. ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పోలీసుల‌పై దాడి చేసినప్పుడు పోలీల‌సు అధికారుల సంఘం ఏం చేసింది. పుష్క‌ర ప్ర‌మాదానికి పోలీసులే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏమైపోయింది. అని రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News