అజాత శత్రువు రాజకీయ రిటైర్మెంట్

Update: 2016-09-02 07:32 GMT
తెలుగు రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరున్న కొణిజేటి రోశయ్య.. ఏపీ రాజకీయాలకు దూరం కానున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోశయ్య.. అనంతరం తన పదవికి రాజీనామా చేశాక తమిళనాడు గవర్నర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన గవర్నర్ పదవీ కాలాన్ని ఇటీవలే పూర్తిస్థాయిలో పూర్తి చేశారు. మరోసారి తమిళనాడు గవర్నర్ గా అవకాశం లభిస్తుందన్న అంచనాలు వినిపించినా.. మోడీ సర్కారు అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదు.

రోశయ్యను గవర్నర్ గా కొనసాగించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మోడీకి లేఖ రాసినా.. ఆయన ఆ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోలేదనే చెప్పాలి. అసలుసిసలు కాంగ్రెస్ వాదిగా.. పాత రాజకీయాలకు చిట్టచివరి ప్రతినిధిగా చెప్పుకునే రోశయ్య తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను రాజకీయాల్లో కొనసాగాలని అనుకోవటం లేదని చెప్పిన ఆయన.. ఏపీ కాంగ్రెస్ లో ఉండనని తేల్చేశారు. తమిళనాడు గవర్నర్ గా పదవీ బాధ్యతల్ని నిర్వర్తించి.. ఆ పదవి నుంచి వైదొలిగిన ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 60 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగానని ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా వెల్లడించటం గమనార్హం. ఏపీలో తనకు నివాసం అక్కర్లేదని.. తాను ఏపీ రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని అనుకోవటం లేదని చెప్పేయటం విశేషం. గుంటూరు జిల్లాకు చెందిన రోశయ్య రాజకీయాల నుంచి దాదాపు వైదొలుగుతన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అధికారికంగా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించని రోశయ్య.. తనకు రాజకీయాలు ఏమాత్రం ఇంట్రస్ట్ లేనట్లుగా చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News