హైదరాబాద్‌ చుట్టూ ఆర్ఆర్ఆర్..తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయా ?

Update: 2021-07-28 06:20 GMT
హైదరాబాద్‌ చుట్టూ మరో రింగ్ రోడ్డు రానుంది. చౌటుప్పల్, సంగారెడ్డి తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్డు నగర ముఖచిత్రాన్ని మార్చేసింది. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం అనంతరం భాగ్యనగరం వేగంగా విస్తరించింది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి, శివారు ప్రాంతాలను వేగంగా చేరుకోవడానికి ఈ రింగ్ రోడ్డు ఎంతగానో తోడ్పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నివాస స్థలాలు ఈ రింగ్ రోడ్డును దాటి విస్తరిస్తుండటంతో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ మరో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దీన్ని రీజినల్ రింగ్ రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరానికి 50 నుంచి 70 కి.మీ. దూరంలో ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు 30 నుంచి 40 కి.మీ. దూరంలో ఉండనుంది.కొత్త రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ 20కి పైగా ముఖ్య పట్టణాలను కలుపుతూ వెళుతుంది.తెలంగాణలోని 40 శాతం మంది ప్రజలకు ఈ కొత్త రింగ్‌ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.
హైదరాబాద్‌ కు వచ్చే అన్ని ప్రధాన హైవేలు, జాతీయ రహదారులను కలుపుతూ ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది.రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. రెండు దశల్లో నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదటి దశలో భాగంగా సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 158 కి.మీ. మేర రింగ్ రోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రూ.9,522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో భాగంగా చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి మధ్య 182 కి.మీ. మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తర భాగం అయిన సంగారెడ్డి– నర్సాపూర్‌– తూప్రాన్‌– గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌– జగదేవ్‌ పూర్‌– యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్‌ వరకు ఉండే 164 కి.మీ. పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది.

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అలైన్‌ మెంటును ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ మరో పది రోజుల్లో రంగంలోకి దిగనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఎన్‌ హెచ్‌ ఏఐ గత నెలలో టెండర్లు పిలిచింది. 20 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. చివరకు నాగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న కే అండ్‌ జే సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ మరో నాలుగు రోజుల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్‌ ఆర్‌ ఆర్‌ క్షేత్రస్థాయి కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభించనుంది. అవసరమైన మార్పులుచేర్పులతో తుది అలైన్‌ మెంటును ఖరారు చేయడంతోపాటు డీపీఆర్‌ను తయారు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఎన్‌ హెచ్‌ ఏఐ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌ లో తమ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది.

గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థను కన్సల్టెంటుగా నియమించారు. ఆ సంస్థ అప్పట్లో గూగుల్‌ మ్యాపు ఆధారంగా ప్రాథమిక అలైన్‌ మెంటును ఖరారు చేసింది. ఆర్‌ఆ ర్‌ఆ ర్‌ అక్షాంశ రేఖాంశాలను నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోగా కన్సల్టెన్సీ గడువు తీరిపోయింది. తాజాగా కొత్త సంస్థను నియమించుకోవాల్సి రావటంతో టెండర్లు పిలిచిన ఎన్‌ హెచ్‌ ఏఐనాగపూర్‌ కంపెనీని ఎంపిక చేసింది. ఈ సంస్థ తొలుత అలైన్‌ మెంటును ఖరారు చేసిన తర్వాత ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాలో తేల్చనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేసి డీపీఆర్‌ తయారు చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు పది నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు


Tags:    

Similar News