కొత్త వెయ్యి నోటు కూడా వస్తుందట!

Update: 2016-11-10 07:24 GMT
కేంద్ర ప్రభుత్వం రూ. 500 - 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ. 500 - 2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరి వెయ్యినోట్ల సంగతేమిటి అనే సందేహాలు జనాల్లో వ్యక్తమయ్యాయి. నల్లదనం - అవినీతి పెరిగిపోవడానికి పెద్దనోట్లే కారణం అని ఒకవైపు వాదనలొస్తున్న తరుణంలో... వెయ్యిని కాదని రెండువేల రూపాయల నోటును ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వెయ్యి రూపాయల నోటు విషయంలో తాజాగా కేంద్రం స్పందించింది. ప్రస్తుతం రద్దు చేసిన రూ.1000 నోటు స్థానంలో త్వరలో కొత్త నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో ప్రస్తుతం కొత్తగా తయారుచేసిన రూ.500 - రూ.2000నోట్లను విడుదల చేసి అందుబాటులోకి తీసుకొచారు. ఇదే క్రమంలో మరికొన్ని నెలల్లో కొత్త డిజైన్‌ తో కూడిన వెయ్యి రూపాయల నోటును కూడా విడుదల చేస్తామని ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ వెల్లడించారు. భద్రత ఏర్పాట్ల విషయంలో రూ. 500 - 2000 నోట్లకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అదే స్థాయిలో మరికొన్ని నెలల్లో కొత్తగా వెయ్యి నోట్లను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు.

కాగా... ఈరోజు బ్యాంకులు తెరవడంతో పాత రూ.500 - రూ.1000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల కొత్త రూ.2000 నోటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అలాగే డిసెంబరు 30లోగా పాత 500 - వెయ్యి నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.

రూ. 500 - 1000 నోట్ల రద్దు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ నిర్ణయంతో నల్లదనం - అవినీతి - నల్లబాబుల ఆటకట్టుల సంగతి అలా ఉంచితే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నేటి నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూ. 500 - రూ. 2000 నోట్లు అండుబాటులోకి రావడం కొంతలో కొంత ఉపశమనం! కానీ బ్యాంకుల్లో 500 - 2000 రూపాయల కొత్త నోట్లు మాత్రమే ఇస్తారు. మరి చిల్లర కావాలంటే... మరి దాని పరిస్థితి ఏంటి? ఇప్పటికే జనం చిన్న నోట్ల కోసం ఎగబడుతున్నారు. అయితే ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కథనాలొస్తున్నాయి.

ఇప్పటివరకూ ఏటీఎం లలో 100 నోట్ల సంఖ్యను పెంచిన రిజర్వ్ బ్యాంక్ - అన్ని ఏటీఎం సెంటర్లలో 50రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ఏటీఎంల్లో 50 రూపాయల నోట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధన ప్రకారం రోజుకు కేవలం 2వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలట! ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే చాలామందికి చిన్ననోట్ల కష్టాలు తీరినట్లే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News