న‌డిరోడ్డుపై ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ను న‌రికేశారు!

Update: 2017-08-24 08:09 GMT
కేర‌ళ‌లో క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వ‌రుస హ‌త్య‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ హ‌త్య‌ల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్య‌ధికులు హిందూ వాదులే ఉండ‌టం ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. క‌మ్యూనిస్టుల పాల‌న‌లో కేర‌ళ‌లో స‌రికొత్త త‌ర‌హా పాల‌న అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్న భావ‌నతో ఉన్న అక్క‌డి ప్ర‌జ‌లు తాజా ప‌రిస్థితుల‌ను చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాము విప‌క్షంలో ఉంటే ప్ర‌తి విష‌యంపై రోడ్డెక్కి మ‌రీ ఆందోళ‌న‌కు దిగే కమ్యూనిస్టులు... త‌మ నేత పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని స‌ర్కారు ఏలుబ‌డిలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటే మాత్రం నోరు విప్ప‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక తాజా ఉదంతం విష‌యానికి వ‌స్తే... ఆ రాష్ట్రంలో నడిరోడ్డుపై మరో ఆరెస్సెస్‌ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్‌ గురువారం ఉదయం మలప్పురం జిల్లాలో కత్తిపోట్లతో హత్యకు గురై కనిపించాడు. ఇటీవల కేరళలో రాజకీయ హింస పేట్రేగుతున్న నేపథ్యంలో తాజా  ఘటన రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు. ఫైజల్‌ పుల్లనీ అలియాస్‌ అనీష్‌కుమార్‌ హత్యకేసులో విపిన్‌ నిందితుడిగా ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ఇస్లాం మతంలోకి మారాడన్న కారణంతో ఫైజల్‌ను దుండగులు కొట్టిచంపారు. ఈ దుండగుల బృందంలో ఒకడైన విపిన్‌ గతవారమే బెయిల్‌పై విడుదలయ్యాడు.

కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యర్థులను కిరాతకంగా హతమారుస్తోందని ఆరెస్సెస్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే 34 ఏళ్ల ఆరెస్సెస్‌ కార్యకర్త కిరాతకంగా హత్యకు గురయ్యాడు. సీపీఎం మద్దతుదారులు అతడ్ని చేతులు నరికి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరెస్సెస్‌ కార్యకర్త హత్యకు గురికావడం కేరళలో ఉద్రిక్తత రేపుతోంది.
Tags:    

Similar News