దేశచ‌రిత్ర‌లో ఘోరం....కొండ‌గ‌ట్టు ప్ర‌మాదం!

Update: 2018-09-11 14:46 GMT
ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం సుర‌క్షితం....ప్రైవేటు వాహ‌నాలు - ఆటోల‌లో ప్ర‌యాణం సుర‌క్షితం కాదు...అని ప్ర‌భుత్వం విప‌రీత‌మైన ప్ర‌చారం క‌ల్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, కొంత‌కాలంగా ఆర్టీసీ బ‌స్సులు కూడా త‌ర‌చుగా ప్ర‌మాదాల‌కు గురికావ‌డం....ఆ ఘ‌ట‌న‌ల్లో కొంత‌మంది అమాయ‌కులు బ‌లి కావ‌డం శోచ‌నీయం. బాధ్య‌త‌గా ఉండాల్సిన డ్రైవ‌ర్ల నిర్లక్ష్యం కావ‌చ్చు....మితిమీరిన వేగం కావ‌చ్చు....ఇలా కార‌ణాలేమైనా...ప్ర‌యాణికులు బ‌ల‌వుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైద‌రాబాద్ లో ప్ర‌యాణికుల‌పైకి ఓ సిటీ బ‌స్సు దూసుకు వ‌చ్చిన ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న తెలంగాణ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆ ఘ‌ట‌న మ‌రువుక ముందే నేడు తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టు స‌మీపంలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చ‌నిపోయారన్న దానిపై పూర్తి స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికీ.... ఆ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 80 మందిలో దాదాపు 51 మంది చ‌నిపోయార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఆ సంఖ్య‌పై ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదాల్లో ఇది ఒక‌ట‌ని జాతీయ మీడియా కూడా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది. భారత రాష్ట్రపతి - ప్రధానితో పాటు ప‌లువురు ఈ దుర్ఘ‌ట‌న‌పై స్పందించి బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గ‌తంలో లోయల్లో బ‌స్సు పడిన ఘ‌ట‌న‌ల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంత ఎక్కువ‌గా లేదు. అందుకే, నేటి ప్ర‌మాదంలో 50 మందికి పైగా మరణించడం అంద‌రినీ తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది. అయితే, 50 నుంచి 60 మంది కెపాసిటీ ఉన్న బ‌స్సులో దాదాపుగా 80మందిని ఏవిధంగా ఎక్కించుకున్నార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అదీగాక‌, కొండ‌గ‌ట్టు లో ప్ర‌మాదం జ‌రిగిన రోడ్డు బ‌స్సు ప్ర‌యాణానికి అనుకూలం కాదని - ఇటు బ‌స్సులు తిర‌గ‌వ‌ని ఆప‌ద్ధ‌ర్మ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి డ్రైవర్ అవ‌గాహ‌నా రాహిత్యం...నిర్ల‌క్ష్యం....ఎంతోమంది నిండుప్రాణాల‌ను బ‌లితీసుకుంద‌ని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. అందునా...ఆ మృతుల్లో 10 మంది వ‌ర‌కు చిన్నారులున్నారన్న సంగ‌తి ప‌లువురుని క‌లచి వేస్తోంది. మృతుల కుటుంబాల‌కు 5 లక్షల పరిహారాన్ని టీ స‌ర్కార్ ప్రకటించింది. అయితే, సానుభూతులు...ఎక్స్ గ్రేషియాలు...పోయిన ప్రాణాల‌ను తిరిగి తేలేవు క‌దా. ఇక‌నైనా...ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన బాధ్య‌త ఇటు డ్రైవ‌ర్ల‌పై, ఆర్టీసీ యాజ‌మాన్యంపై...ప్ర‌భుత్వంపై ఉందన్న‌ది అక్ష‌ర స‌త్యం.
Tags:    

Similar News