ఆర్టీసీ పీఎఫ్ నిధులు.. 1600 కోట్లు ప్ర‌భుత్వం తీసుకుంటుందా?

Update: 2021-12-21 05:32 GMT
ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు.. ఇత‌ర‌త్రా రుణాలు వంటివాటిపై.. కొన్ని నెల‌లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు, కామెంట్లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఏది న‌మ్మాలో.. ఏది న‌మ్మ‌కూడ‌దో తెలియ‌దు క‌దా! ఇక‌, వాస్త‌వం చూస్తే.. ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమం వ‌ల్ల కావొచ్చు.. ఇత‌ర‌త్రా ఆర్థిక‌భారంగా ఉన్న ప‌థ‌కాలు కావొచ్చు.. ఏదేమైనా.. అప్పులు మాత్రం చేయాల్సి వ‌స్తోంది. దీంతో విప‌క్షాల‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

అది.. ఆర్టీసీకి ఉన్న రూ.1600 కోట్ల‌ను కూడా ప్ర‌భుత్వ‌మే తీసేసుకునేందుకు ప్లాన్ చేసింద‌ని.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. అయితే.. దీనిలో ఏమేర‌కు నిజం ఉందో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన సంగ‌తులు ప‌రిశీలిస్తే.. మాత్రంనిజం లేకుండా ఉంటుందా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఎందుకంటే. ఇటీవ‌లే.. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి చెందిన స్థూల నిధి రూ.400 కోట్ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగినా.. కూడా ప్ర‌భుత్వం మాత్రం తాను చేయాల‌ని అనుకున్న‌ది చేసేసింది.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఆర్టీసీ నుంచి కూడా ఉద్యోగులు త‌మ భ‌విష్య నిధికోసం దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం రూ.1600 కోట్ల వ‌ర‌కు తీసుకుంటోంద‌ని అంటున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్షం టీడీపీ సోష ల్ మీడియాతో పాటు.. అంద‌రూ వైర‌ల్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఇది ఆర్టీసీ ఉద్యోగులను మ‌రింత క‌ల‌వ ర పెడుతోంది.

ఎందుకంటే.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేశారు. అయినప్ప‌టికీ.. ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. త‌మ‌కు ఏం ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

క‌నీసం.. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కూడా లేద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా ఎలాంటి వేత‌నాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు. పేరుతో విలీనం అయిన‌ట్టుగా ఉంద‌ని వాపోతున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌ప‌డ‌కుండా.. త‌మ‌లో తాము కుమిలిపోతున్నారు.

ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం ఒక ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగింద‌ని.. అది ఇందుకేనా(రూ.1600 కోట్లు తీసుకునేందుకు) అని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. విలీనంతో త‌మ‌కేదో ఒరుగుతుంద‌ని భావించామ‌ని. ఈ క్ర‌మంలోనే సీఎం చిత్ర‌ప‌టాల‌కు, మంత్రుల చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం చేశామ‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు కార్మికులు దూకుడుగా.. త‌మ‌కు కూడా టైం వ‌స్తుంద‌ని.. ఎన్నిక‌ల‌ప్పుడు.. త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అయితే.. ఇంత‌లోనే సోష‌ల్ మీడియాలో రూ.1600 కోట్ల‌కు సంబంధించిన వార్త‌లు రావ‌డంతో మ‌రింత‌గా కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఉద్యోగుల భ‌విష్య నిధివిష‌యంలో ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రించే ఛాన్స్ ఉందా? అనేది ప్ర‌శ్న‌. దీనిలో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ.. ఉద్యోగులు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు.

ప్ర‌భుత్వం దీనిపై త్వ‌ర‌లోనే వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. వైసీపీనేత‌లు కోరుతున్నారు. లేక‌పోతే..ఇప్ప‌టికే జ‌రిగిన న‌ష్టాల‌కు ఇది కూడా తోడ‌వుతుంద‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. పీఆర్సీ తదిత‌ర స‌మ‌స్య‌ల‌ను తీర్చలేక‌.. ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల వ్య‌తిరేకత కూడా తోడైతే..మ‌రిన్ని ఇబ్బందులు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.
Tags:    

Similar News