ఐటీ ఊద్యోగులు.. ఈ అప్డేట్ అందిందా?

Update: 2021-12-16 02:18 GMT
మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా దెబ్బకు క్యాలెండర్లో నెలలు కాదు.. సంవత్సరాలు సైతం మారిపోతున్నాయి. 2020 మొదట్లో మొదలైన కరోనా దెబ్బకు మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోవటం తెలిసిందే.వర్కు ఫ్రం హోం అన్నంతనే గుర్రుగా చూసే కంపెనీలు.. మీ ఇంట్లో మీరుండి పని చేయండంటూ తేల్చేసి.. ఆఫీసులకు రావొద్దని చెప్పటం తెలిసిందే.

అప్పటి నుంచి ఇంటి నుంచే పని చేయటం మొదలు పెట్టిన ఐటీ ఉద్యోగులకు.. నయా సాల్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురు కావటం ఖాయమంటున్నారు.

ఇప్పటివరకు వర్కు ఫ్రం హోంకు మొగ్గు చూపిన కంపెనీలు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగులు ఆఫీసుకు రావాలన్న నిబంధనను కచ్ఛితం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త ఏడాది జూన్ - జులై నాటికి ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది ఆఫీసుకు కచ్ఛితంగా రావాల్సిన అవసరం ఉందన్న మాట పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. హైబ్రిడ్ మోడల్ ను కూడా ప్రవేశ పెట్టాలన్న యోచనలో కంపెనీలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ హైబ్రిడ్ విధానంలో 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు వారానికి రెండు లేదంటే మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జులై నాటికి వంద శాతం మేర ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకురావాలన్న యోచనలో కొన్ని కంపెనీలు ఉన్నాయి.

అయితే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్ని వెంటాడుతున్నాయి. ఇంతకాలం అన్ని జాగ్రత్తలు తీసుకొని.. ఇప్పుడు అందుకు భిన్నంగా కొత్త వేరియంట్ వేళ.. ఆఫీసులకు రావాలని చెబితే ఎలా? అని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉద్యోగుల నుంచి వస్తున్న విన్నపాలను పరిశీలిస్తున్న కంపెనీలు కొన్ని తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి.. మార్చి నాటికి దేశంలో ఒమిక్రాన్ అలజడి ఉంటుందని.. ఆ వేవ్ ఖాయమని కొందరు అంచనా వేస్తున్న వేళ.. అంత వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మరికొన్ని కంపెనీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా లేకుంటే మాత్రం.. వచ్చే ఏడాది ఐటీ ఉద్యోగుల్లో సింహ భాగం.. ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమైనా.. వర్కు ఫ్రం హోంకు మొగ్గు చూపే చాలామంది ఉద్యోగులకు.. తాజాగా కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికి గురి చేసేవని చెప్పక తప్పదు.


Tags:    

Similar News