నిజ‌మా?.. విజ‌య‌మ్మ వైసీపీని వీడ‌తారా?

Update: 2021-09-02 03:30 GMT
గ‌డ‌చిన రెండు రోజులుగా ఏపీలో అదికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఓ వార్త పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో వైర‌ల్ గా మారిపోయింది. ఏ ఇద్ద‌రు రాజ‌కీయ నేత‌లు క‌లిసినా.. ఇదే విషయంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ వార్త‌లో నిజ‌మెంత అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసిన నేత‌లు.. ఆ వార్త ప్ర‌కారం ప‌రిణామాలు చోటుచేసుకుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న కోణంలో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు ఆ వార్త ఏమిటంటే.. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి స‌తీమ‌ణి, ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ గౌర‌వాధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్న వైఎస్ విజ‌య‌మ్మ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌న్నదే ఆ వార్త సారాంశం. వైఎస్సార్సీపీ వేరెవ‌రి పార్టీనో కాదు క‌దా.. ఏపీ సీఎంగా ఉన్న త‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన పార్టీనే క‌దా. అలాంటి పార్టీలో గౌర‌వాధ్య‌క్షురాలిగా కొనసాగుతున్న విజ‌య‌మ్మ‌... ఇప్పటికిప్పుడు ఆ పార్టీని ఎందుకు వ‌దిలేస్తారు? ఈ ప్ర‌శ్న‌కు కూడా కొంద‌రు త‌మ‌దైన శైలి స‌మాధానాలు, విశ్లేష‌ణ‌లు ఇస్తున్నారు.

మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మృతి చెంది అప్పుడే 12 ఏళ్లు గ‌డిచిపోయాయి. గురువారం నాడు తెలుగు నేల వ్యాప్తంగా వైఎస్ వ‌ర్ధంతి జ‌ర‌గ‌నుంది. ఎక్క‌డికక్క‌డ నేత‌లు వైఎస్ కు నివాళి అర్పించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునేందుకు అటు జ‌గ‌న్ తో పాటు ఇటు తెలంగాణ‌లో కొత్తగా వైఎస్సార్టీపీ పేరిట పార్టీ పెట్టిన జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిలలు కూడా ఇడుపుల‌పాయ‌కు చేరుకున్నారు. కూతురుతోనే క‌లిసి హైద‌రాబాద్ లో ఉంటున్న విజ‌య‌మ్మ కూడా ఇడుపుల‌పాయ చేరుకున్నారు. ఏపీలో ఎలాగూ కుమారుడి పార్టీ అదికారంలోకి వ‌చ్చింది. ఇక తెలంగాణ‌లో కూతురు ప్రారంభించిన పార్టీ ఇంకా నిల‌దొక్కుకోలేదు. పార్టీ బ‌లోపేతానికి విజ‌యమ్మ‌ను ష‌ర్మిల సాయం కోరారు. ఈ క్రమంలో పార్టీ ప్రారంభోత్స‌వ వేడుక‌లోనూ విజ‌య‌మ్మ పాలుపంచుకున్నారు. దీంతో వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ‌.. ఇప్పుడు వైఎస్సార్టీపీ స‌మావేశాల‌కు ఎలా హాజ‌ర‌వుతార‌ని కూడా నొస‌లు చిట్లించారు.

తాజాగా వైఎస్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని వైఎస్ బ‌తికుండగా ఆయ‌న‌తో క‌లిసి న‌డిచిన రాజ‌కీయ నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని విజ‌య‌మ్మ భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా వైఎస్ తో అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన వారి జాబితా తీసుకుని వారికి ఆహ్వానాలు పంపారు. ఈ జాబితాలోని చాలా మంది నేత‌ల‌కు స్వ‌యంగా విజ‌య‌మ్మే ఫోన్ చేసి మ‌రీ స‌మావేశానికి రావాలంటూ కోరారు. అయితే ఈ స‌మావేశాన్ని ష‌ర్మిల పార్టీ బ‌లోపేతం కోస‌మే విజ‌య‌మ్మ ప్లాన్ చేశార‌న్న వాద‌న‌లను వైరివర్గాలు ప్ర‌చారం చేయ‌డం మొద‌లెట్టాయి. గురువారం జ‌రిగే స‌మావేశానికి దాదాపుగా విజ‌య‌మ్మ పిలిచిన వారంతా హాజ‌ర‌య్యే అవ‌కాశాలే ఉన్నాయి. వీరితో స‌మావేశంలో ష‌ర్మిల పార్టీ ప్ర‌స్తావ‌న ఉంటుందో, లేదో కూడా తెలియ‌దు గానీ.. ఈ స‌మావేశం త‌ర్వాత విజ‌య‌మ్మ వైసీపీకి రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం హోరెత్తిపోతోంది.
Tags:    

Similar News