రూ.2వేల నోటు ర‌ద్దు మాట‌లో నిజ‌మెంత‌?

Update: 2017-11-03 05:40 GMT
అగ్ర‌శ్రేణి ప‌త్రిక‌ల్లో వ‌చ్చే ప్ర‌తి మాటకు ప్ర‌జ‌ల‌పైనా.. ప్ర‌భుత్వం పైనా ఎంతోకొంత ప్ర‌భావం ఉంటుంది. అందులోకి ఏదైనా విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప‌తాక శీర్షిక‌లో అచ్చేస్తే దాని మీద చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక‌.. ప్ర‌జ‌ల్లో ఉన్న సందేహాన్ని పోగేసి వార్త‌గా వేయ‌టం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. ఎందుకంటే.. కొత్త అయోమ‌యానికి తావిచ్చిన‌ట్లు అవుతుంది. కానీ.. ప‌త్రిక‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ద‌టం కోసం.. పాఠ‌కుల్లో ఆస‌క్తిని పెంచేందుకు.. పోటీ ప‌త్రిక‌లు ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసి.. కొత్త గుబులు పుట్టించే వ్యాపార ధోర‌ణికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా అగ్ర పత్రిక మొద‌టి పేజీలో అచ్చేసిన రూ.2వేల నోటు ర‌ద్దు వార్త‌ను చెప్పాలి.

రూ.2వేల నోటు ర‌ద్దు అంటూ క్వ‌శ్చ‌న్ మార్క్ తో ఉప శీర్షిక పెట్టినా.. ఎంత కంగారు పెట్టాలో అంత కంగారు పెట్టార‌నే చెప్పాలి. పెద్ద నోటు అడ్డం తిరిగిందన్న శీర్షిక‌తో అచ్చేసిన వార్త చూసినంత‌నే నిద్ర మ‌త్తు వీడియోలా ఉంద‌ని చెప్పాలి.

మోడీ పుణ్య‌మా అని ఎప్పుడేం చేస్తారో.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలీని ప‌రిస్థితి. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి.. రూ.2వేల నోట‌ను తెర మీద‌కు తీసుకొచ్చి దాదాపుగా ఏడాది కావొస్తోంది (మ‌రో ఐదు రోజుల‌కు సంవ‌త్స‌రం పూర్తి అవుతుంది) గ‌డిచిన ప‌న్నెండు నెల‌ల్లో రూ.2వేల నోటు మీద వ‌చ్చిన ఊహాగానాలు అన్నిఇన్ని కావు. వెయ్యి నోటును ర‌ద్దు చేసిన త‌ర్వాత బ్లాక్ మ‌నీని ఫిల్ట‌ర్ చేయొచ్చ‌న్న మాట చెప్పినా అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోగా.. మార్కెట్లో ఉన్న డ‌బ్బులు దాదాపు ప్ర‌భుత్వానికి వెళ్లిపోయిన‌ట్లుగా ఈ మ‌ధ్య‌న విడుద‌ల చేసిన లెక్క‌లు చెప్పాయి.

దీంతో.. మ‌రోసారి ఫిల్ట‌ర్ చేసే ప‌నిలో భాగంగా రూ.2వేల నోటును ర‌ద్దు చేయ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌లు ఏవీ అధికారికం కాద‌ని చెప్పాలి. ఆ మాట‌కు వ‌స్తే రూ.2వేల నోటు ర‌ద్దుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఒక్క‌రూ మాట్లాడింది లేదు.

అయితే.. కొన్ని ఘ‌ట‌న‌లు చూపించి.. రూ.2వేల నోటు ర‌ద్దు చేయ‌టానికి అవ‌కాశం ఉంద‌న్న భావ‌న క‌లిగించ‌టంలో మాత్రం అగ్ర పత్రిక  వార్త స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పాలి. నిజానికి వారి వార్త‌ను పూర్తిగా చ‌దివిన‌ప్పుడు రూ.2వేల నోటు ర‌ద్దు అన్న‌ది దాదాపుగా లేద‌న్న‌ట్లే చివ‌ర్లో చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కాకుంటే.. పాఠ‌కుల‌ను  ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఈ క‌థ‌నాన్ని భారీ ప్రయారిటీ ఇచ్చార‌న్న భావ‌న క‌ల‌గ‌టం కాయం. ఇంత‌కీ పత్రిక  వారికి రూ.2వేల నోటు ర‌ద్దు చేస్తార‌ని ఎందుకు అనిపించింది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే..  ఇటీవ‌ల కాలంలో రూ.2వేల నోటు ప్రింటింగ్‌ ను నిలిపివేశార‌ని.. ఆ స్థానే రూ.500.. రూ.5.. రూ.2 మాత్ర‌మే ముద్రిస్తున్న‌ట్లుగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద స‌మాధానం పొందిన‌ట్లుగా పేర్కొన్నారు.

రూ.2వేల నోటును తీసుకొచ్చిన ఉద్దేశం ఫ‌లించ‌క‌పోవ‌టంతో రూ.2వేల నోటు ర‌ద్దు దిశ‌గా మోడీ స‌ర్కారు ఆలోచింద‌న్న మాట‌ను చెప్పిన‌ప్ప‌టికి వాస్త‌వంలో అదంత తేలికైన ప‌ని కాద‌న్న‌ది వాస్త‌వం. ఇప్ప‌టికే జీఎస్టీ దెబ్బ‌కు ఆగ‌మాగం అవుతున్న మోడీ స‌ర్కారు.. ఈసారి కానీ రూ.2వేల నోటును ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకొస్తే.. భారీ వ్య‌తిరేక‌త రావ‌టం త‌థ్యం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న వేళ‌.. అంత సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్ప‌టం. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం దేశానికి మేలు చేస్తే.. అత్య‌ధికంగా ఉన్న పేద‌లు.. సామాన్యులు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఎంతోకొంత ఓకే అనేవాళ్లు. కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌న్న విష‌యంపై త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్న వేళ‌..రూ.2వేల నోటు ర‌ద్దు అన్న‌ది ఉత్త మాట‌గానే చెప్పాలి.

Tags:    

Similar News