ఉక్రెయిన్‌ పై యుద్ధం.. ర‌ష్యా అధ్య‌క్షుడి సిగ్గులేని స‌మ‌ర్ధ‌న‌!

Update: 2022-05-09 14:22 GMT
ఒక‌వైపు వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ధ్వంస‌మ‌వుతున్నాయి. సైనికులు మ‌హిళ‌లు, బాలిక‌లు.. అని కూడా చూడ‌కుండా.. అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. వంద‌ల సంఖ్య‌లో శ‌వాల‌ను పూడ్చేందు కు గోతులు తీసి ఉంచారు. ఇంతటి మార‌ణ  కాండ ఎప్పుడూ.. చూడ‌లేదు.. అంటూ.. ప్ర‌పంచం మొత్తం గ‌గ్గోలు పెడుతోంది. అయినా.. ర‌ష్యా అధ్య‌క్షుడు మాత్రం తాను చేస్తున్న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సిగ్గులేకుండా స‌మ‌ర్ధించుకున్నారు.

ఉక్రెయిన్లో చేపడుతున్న ప్రత్యేక సైనిక చర్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల విధానాలు, వారి దురాక్రమణను అడ్డగించేందుకే ఈ సైనిక చర్య ప్రారంభించినట్లు చెప్పారు. పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామన్నారు. నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి 'మాతృభూమి'ని రక్షించుకోవడం కోసమే ఉక్రెయిన్‌లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు. విక్టరీ డే(మే 9) ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్.

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న 'విక్టరీ డే' పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్‌ స్క్వేర్‌ వద్ద పరేడ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా పుతిన్‌ ప్రసంగిస్తూ.. ఉక్రెయిన్‌లో రష్యా చర్యను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ పోరాటంతో పోల్చారు.

 "ఉక్రెయిన్‌ లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య. ఉక్రెయిన్‌ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యా బలగాలు అక్కడ పోరాడుతున్నాయి" అని పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్‌ సైనికులకు ఆయన నివాళులర్పించారు.

ఉక్రెయిన్‌ పై సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి నియో నాజీలను ఆ దేశం నుంచి తరిమి కొడతామని రష్యా చెబుతూ వస్తోంది. నిజానికి ఈ విక్టరీ డే పరేడ్‌లో పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశంలో కొనసాగిస్తున్న ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

11 వారాలుగా ద‌మ‌న కాండ‌

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్‌ సైనిక చర్యను ప్రకటించారు. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన క్రెమ్లిన్‌ ఆ తర్వాత జనావాసాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. 11 వారాలుగా ఈ దండయాత్ర కొనసాగుతోంది. అయితే రష్యన్‌ సేనలను ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. అమెరికా సహా పలు దేశాల ఆయుధ సహకారంతో రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. అయితే ఈ యుద్ధం ఇరువైపులా భారీ నష్టాన్నే మిగిల్చింది. వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఉక్రెయిన్‌లోని పలు నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి.
Tags:    

Similar News