ఓడే సీటును సాయికుమార్‌ కు ఇచ్చారా?

Update: 2018-05-15 03:53 GMT
ప్ర‌ముఖ సినీ న‌టుడు సాయికుమార్ ఆశ‌లు ఆడియాశ‌లు కానున్నాయి. గ‌తంలో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి రెండు సార్లు ఓట‌మిపాలైన ఆయ‌న‌.. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న గెలుపు ఖాయ‌మ‌ని.. త‌న ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు సానుభూతితో ఉన్నార‌ని.. త‌న‌ను గెలిపించ‌టం ఖాయ‌మ‌ని చెప్పుకున్నారు.

అయితే.. సాయికుమార్ అనుకున్న‌ది ఒక‌టైతే.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌రోలా అనుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.  బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న డిపాజిట్ కూడా కోల్పోవ‌డం విశేషం. ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్ల‌ను సొంతం చేసుకొని దూసుకెళుతున్న బీజేపీ బ‌లం సాయికుమార్ కు ఏ మాత్రం సాయప‌డ‌న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 90సీట్ల కంటే ఎక్కువ వ‌స్తాయ‌ని అంచ‌నా వేసినోళ్లు చాలా త‌క్కువ మందే. మెజార్టీ అంచ‌నాకు భిన్నంగా బీజేపీ పూర్తి సీట్ల‌తో అధికారం చేప‌ట్ట‌నుంది. కానీ సాయికుమార్ మాత్రం ఘోరంగా ఓడిపోయారు. అయితే, ఇది సాయికుమార్ స్వ‌యంకృతాప‌రాధం. బీజేపీ అతితెలివి అని అర్థ‌మ‌వుతోంది.

తెలుగువారు అధికంగా ఉండే బాగేప‌ల్లిని చూసి అక్క‌డ పోటీ చేస్తే గెలుస్తాన‌ని బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు సాయికుమార్. కానీ ఆ సీటు ఎంపిక‌తోనే ఆయ‌న ఓడిపోయిన‌ట్లు ఓట్ల లెక్క చూస్తే అర్థ‌మ‌వుతోంది. స్థానిక బీజేపీ నేత‌ను కాద‌ని మ‌రీ.. ఒత్తిడితో సాయికుమార్ కు టికెట్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నా అది బీజేపీ సీటే కాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇక్క‌డ  కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్ ఎన్ సుబ్బారెడ్డి ప‌దివేల భారీ మెజారిటీతో గెల‌వ‌గా, రెండో స్థానంలో నిలిచింది బీజేపీ కాదు, జేడీఎస్ కాదు..  సీపీఎం. క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన సీపీఐ (ఎం) అభ్య‌ర్థి 42 వేలు ఓట్లు గెలుచుక‌ని రెండో స్థానంలో నిలిచారు. జ‌న‌తాదళ్ సెక్యుల‌ర్ అభ్య‌ర్థికి కూడా 29 వేల ఓట్లు వచ్చాయి. అంటే అది ఎంత మాత్ర‌మూ బీజేపీ గెలిచే సీటు కాద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే త‌ప్ప‌దు అన్న‌ట్లు ఒక ఓడిపోయే సీటును సాయికుమార్‌కు ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఇంత‌కీ సాయికుమార్‌ కు వ‌చ్చిన ఓట్లు 4000 లోపు అంటేనే ప‌రిస్థితి అక్క‌డ ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. ఇదంతా ప‌క్క‌న పెడితే 40 వేల ఓట్లు క‌మ్యూనిస్టు పార్టీకి ప‌డ్డాయంటే అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ధైర్యంతో సాయికుమార్ పోటీకి దిగాడా? అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.
Tags:    

Similar News