ఏపీ తెలంగాణ కలపాలన్న లొల్లి షురూ చేసిన వైసీపీ.. భగ్గుమన్న తెలంగాణ

Update: 2022-12-08 16:30 GMT
ఏపీలోని అధికార వైసీపీ అగ్గిరాజేసింది. మళ్లీ తెలంగాణ అంటుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు.. సీఎం జగన్ రైట్ హ్యాండ్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం అని సజ్జల అనడం అగ్గిరాజేసింది.  'రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్ని మేం వదులుకోబోము. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుంది. ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా?' అని సజ్జల సంచలన కామెంట్స్ చేశారు.

దీనికి కొనసాగింపుగా వ్యూహాత్మకంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మద్దతు పలికారు. 'ఏపీ తెలంగాణ కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలవాలని చెప్తాము.. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటివరకూ పోరాడుతున్నాం.. ఉండవల్లి చెప్పింది వేదం కాదు.. చట్టం కాదు.. చట్టప్రకారం ఏపీకి రావాల్సినవన్నీ రావాలి' అని బొత్స సంచలన ప్రతిపాదన చేశారు.

ఏపీ మంత్రులు, నేతలు ఇలా వరుసగా మాట్లాడడంతో తెలంగాణ భగ్గుమంది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ దీనిపై తొలిగా స్పందించారు. 'సజ్జల వ్యాఖ్యలు చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ' స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతామని.. రెండు రాష్ట్రాలు కలిపేందుకు అస్సలు ఒప్పుకోమని స్పష్టం చేశారు.

సజ్జల వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. 'సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతో మంది బలిదానాలు.. ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడినరాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలపడం అసాధ్యం. చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభాజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు.. మీ ప్రాంత అభివృద్ధి మీద..

మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు' అని షర్మిల ట్విటర్ లో పేర్కొన్నారు.  ఆఖరుకు ఆంధ్రా ఆడకూతురు కూడా తెలంగాణ , ఏపీని కలపడాన్ని వ్యతిరేకించడం గమనార్హం.

ఇలా ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సజ్జల కామెంట్స్ చిచ్చురేపాయి. వాటిపై తెలంగాణ నేతల స్పందనతో మరింత హీటెక్కాయి.

   

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News