ఇంతకీ పవన్ గొప్పేడే అంటావా సజ్జలా...?

Update: 2022-11-10 14:56 GMT
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడని ఇదే వైసీపీ నేతలు అంటారు. ఆయన ఎందుకూ రాజకీయాలకు పనికిరాడని అంటారు. మరి అదే నోటితో ఆయన మీద విమర్శలు వెల్లువలా చేస్తూంటారు. అంతే కాదు లేటెస్ట్ గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఒక మాట చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, కూలగొట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని. నిజంగా ఇది వింత ఆరోపణగానే చూడాలి.

ఎందుకంటే పవన్ కి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమందని, ఆయనకు టెక్నికల్ గా ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ఇపుడు వైసీపీలోనే కలసిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్  చూస్తే ఎమ్మెల్యే కూడా  కాదు, మరో వైపు టీడీపీ తీసుకుంటే ఆ పార్టీకి ఉన్న వారు కూడా ఇరవై లోపు ఎమ్మెల్యేలు మాత్రమే. మరి ఈ విధంగా ఏపీలో విపక్షాల బలం ఉంది. ఇంకో వైపు చూస్తే 151 మంది ఎమ్మెల్యేలు, అదనంగా మరో అయిదారుగురు ఎమ్మెల్యేలతో రాజకీయంగా చాలా పటిష్టమైన స్థితిలో వైసీపీ ఉంది.

కానీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పవన్ చూస్తున్నారు అన్నట్లుగా సజ్జల మాట్లాడుతూండడం ఆశ్చర్యమే కాదు దారుణంగా ఉంది అనే అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ సజ్జల అన్న మాటలు వింటే పవన్ అంత గొప్పోడా అనిపించకమానదు. ఇది పవన్ని వెటకారం చేసి మాట్లాడం కానే కాదు. పవన్ని అంతటి గొప్పవారిగా చేసిన సజ్జల వారి వైసీపీ వారి బేలతనాన్ని చూసి ఇలా అనుకోవడం అంతే.

ప్రతిపక్షాలు అన్న తరువాత ఏదో ఒకటి చేస్తాయి. గ్లాస్ లో సగం నీళ్ళు ఉంటే వారు సగం లేరు అనే మాట్లాడుతారు. అలా లేని విషయం మీద వీలుంటే సర్కార్ పెద్దలు  మాట్లాడాలి. వారి ప్రశ్నలకు కాదు జనాలకు తగిన తీరున బదులివ్వాలి. అంతే తప్ప ఏది మాట్లాడినా ఏది చేసినా మా సర్కార్ ని కూల్చుతారు అంటూ బెంబేలెత్తిపోతే నిజంగా అన్నేసి సీట్లు ఇచ్చి అధికారం కట్టబెట్టడం ఎందుకు అన్న ఆలోచన సగటు  ఓటరుకు కచ్చితంగా వస్తుందిగా.

ఇక టీడీపీ దాని అనుకూల మీడియా అంటున్నారు సజ్జల. వారు కట్టుకధలు అల్లుతున్నారు అని కూడా చెబుతున్నారు. అదే అనుకుంటే వారు ఇపుడే వచ్చారా. జగన్ రాజకీయాలలో ఉన్నప్పటి నుంచి ఉన్నారు కదా. జగన్ ఏమీ కానపుడు ఒక్క ఎంపీగా ఉన్నపుడే అంతా కలసికట్టుగా వచ్చారని చెప్పుకుంటూ ఉంటుందిగా వైసీపీ. మరి దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని పోరాట యోధుడు జగన్ అని కూడా అంటుంది కదా.

అధికార లేనపుడు ఎమ్మెల్యేలు అన్న వారే లేనపుడు గట్టిగా నిలబడిన జగన్ కానీ వైసీపీ కానీ ఈ రోజు ఎందుకు విపక్షాలను టీడీపీ అనుకూల మీడియా చేసే విమర్శలను తీసుకోలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. దీనికి సజ్జల వారి వద్ద జవాబు ఉందో లేదో తెలియదు. ఉన్నా ఆయన చెప్పలేరు. కానీ జనాలకు తెలుసు అదేంటో.

తమ పరిపాలన మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని తెలిసే వైసీపీ వారు ఇలా విపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు అనుకుంటే తప్పేంటి. ప్రజలు కూడా 2019 మాదిరిగా ఉండరుగా. వారు కూడా మారుతారుగా. వారి ఇంకా ఏవో ప్రభుత్వం నుంచి ఆశించి భంగపడి ఉండవచ్చు. వారంతా ఇపుడు విపక్షాలకు మద్దతు ఇవ్వవచ్చు. అలా ఇస్తారేమో అన్న కంగారు అయితే వైసీపీకి ఉందేమో.  ఏది ఎలా ఉన్నా కూడా వైసీపీ తన నీడను చూసి తాను భయపడుతోందా అన్న సందేహం అయితే అంతటా కలుగుతోంది.

లేకపొతే విశాఖ ఘటన నుంచి పవన్ సర్కార్ కూల్చుడు కోసం చూస్తున్నారు, దానికి టీడీపీ వత్తాసు ఇస్తోంది, అనుకూల మీడియా స్క్రిప్ట్ రెడీ చేసి పెడుతోంది అని పేలవమైన ఆరోపణలు చేయడం ఎందుకు అన్నదే ప్రశ్న. ఇప్పటికైనా మించినది లేదు. చేతిలో ఏణ్ణర్ధం అధికారం ఉంది. ప్రజలను తమ వైపునకు తిప్పుకుని మంచి చేసే పనులు చేయవచ్చు.

అపుడు విపక్షాలు ఎన్ని చెప్పినా జనాలు నమ్మరు కదా. ముందు తమ పాలన తీరుని చక్కబెట్టుకుంటే విపక్షాలు ఒకవేళ కుయుక్తులకు పాల్పడినా సాగవు కదా. అద్దం ఉంది, ఎదురుగా మొహం ఉంది అన్నట్లుగా అన్నీ తమ వద్దే ఉంచుకుని పవన్ మీద ఏడవడం ఎందుకు అని నెటిజన్లు అంటున్నారు అంటే ఆత్మ విమర్శ కచ్చితంగా వైసీపీ వారు చేసుకోవాల్సిందే మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News