సర్వం సజ్జల మయం...?

Update: 2022-04-10 12:25 GMT
అంతా రామమయం అని శ్రీరామనవమి రోజున భక్తులు పాడుకుంటున్న  వేళ వైసీపీ నాయకులు మాత్రం అంతా సజ్జల మయం అని పాట మార్చి పాడుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జగన్ తో పలు మార్లు భేటీ కావడమే కాకుండా సలహాలు సూచనలు అన్నీ కూడా ఇవ్వడం ద్వారా సజ్జల తాను నంబర్ టూ అని నిరూపించుకున్నారు.

పార్టీగా వైసీపీ విపక్షంలో ఉన్నపుడు విజయసాయిరెడ్డి జగన్ కి కుడిభుజంగా ఉండేవారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం సజ్జల రామక్రిష్ణారెడ్డి పాత్ర మెల్లగా ఇంతింతై వటుడింతే అన్నట్లుగా పెరిగి ఇపుడు జగన్ పక్కనే చోటు అన్నట్లుగా మారిపోయింది.

సజ్జలను సకల శాఖల  మంత్రి అని విపక్షాలు బాహాటంగా విమర్శలు చేసినా స్వపక్షంలోని వారు ఆయన్ని పక్కకు పోయి విసుక్కున్నా ఏవరెలా అనుకున్నా కూడా సజ్జల మార్క్ మాత్రం వైసీపీలో చాలా స్ట్రాంగ్ గానే ఉందని ఒప్పుకోక తప్పని పరిస్థితి.

జగన్ మంత్రుల జాబితా ఎంపీకలో కీలకం అని అంతా అంటారు, అనుకుంటారు. కానీ ఆ గత మూడు నాలుగు రోజులుగా  జగన్ వరసబెట్టి కొన్ని గంటల పాటు సజ్జలతో మంతనాలు జరపడం బట్టి చూస్తే వైసీపీ సర్కార్ లో  సజ్జల పాత్ర ఏంటి, ఆయన సలహాలు ఏ స్థాయిలో ఉంటాయని అర్ధం చేసుకోవాలి. దాంతో మాజీ మంత్రుల నుంచి ఆశావహులే కాదు, టోటల్ పార్టీయే  ముందు సజ్జల దర్శనమే చేసుకోవాల్సి వస్తోంది.

ఇక జగన్ కి అన్ని విధాలుగా నమ్మకస్తుడిగా సజ్జల ఉంటున్నారు. ఇక చూస్తే సజ్జల ట్రబుల్ షూటర్ పాత్రను సైతం పోషిస్తున్నారు. ఆ మధ్య జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో సజ్జల పాత్ర చాలా కీలకంగా మారింది. ఆయన మంత్రుల కమిటీలో ఉంటూ అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వారధిగా వ్యవహరించారు. చివరికి సమ్మె లేకుండా ఉద్యోగులతో చర్చలను ఫలవంతం చేసి సక్సెస్ అయ్యారు.

అలా అనేక విషయాల్లో జగన్ కి ఆయన సహకరిస్తూ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. దాంతో వైసీపీలో అంతా సజ్జల మయం అనే అంటున్నారు. ఇది పొగడ్తగా తీసుకుంటే ప్రతిష్టగా ఉంటుంది. అదే సమయంలో విమర్శలు కూడా వస్తాయి కాబట్టి బరువుగానూ ఉంటుంది. అయినా సకల శాఖలూ తెలిసిన అనుభవం ఉన్న సజ్జల దేన్ని అయినా హ్యాడిల్ చేయగలరు అని ఇప్పటికే రుజువు చేసుకున్నారు కాబట్టి ఆయన హవాకు ఢోకా లేదనే చెబుతున్నారు.
Tags:    

Similar News