రాష్ట్రపతి.. గవర్నర్.. సీఎంల జీతాలివే..

Update: 2016-08-10 18:29 GMT
గతంలో లచ్చ రూపాయిల జీతం అంటే.. మా గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడా రోజులు పోయాయి. మూతి మీద సరిగా మీసాలు రాని వయసులోనే ఐటీ ఉద్యోగుల జీతాలు లచ్చలు కొల్లగొట్టే రోజులు వచ్చేశాయి. మరి.. గల్లీలో ఉండే పోరడు జీతాలే ఈ స్థాయిలో ఉంటే.. దేశ ప్రజల్ని ప్రభావితం చేసే పదవుల్లో ఉండే అధినేతలు.. రాష్ట్రాలకు దిశానిర్దేశంగా ఉంటూ కోట్లాది మంది జీవితాల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే వారి నెలసరి జీతాలు ఎంత ఉంటాయో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అసమాన్యంగా కనిపించే ఈ వీవీఐపీల జీతాలు చాలామంది సామాన్యులకు వచ్చే సంపాదన కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

దేశ ప్రధమ పౌరుడి జీతం వింటే.. అవునా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆయన జీతమే కాదు.. పలువురు ప్రముఖుల జీతాల పరిస్థితి అంటే. తాజాగా మహారాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న వేళ.. ప్రముఖుల జీతాల లెక్క తాజాగా తెర మీదకు వచ్చింది. చాలామంది ఐటీ సీనియర్ మేనేజర్ల కంటే తక్కువ మొత్తంలో వచ్చే వీరి జీతాలు మరీ ఇంత తక్కువా? అనిపించక మానవు.

ప్రముఖుల జీతాలు చూస్తే..

రాష్ట్రపతి ;       రూ.1.50లక్షలు

ఉప రాష్ట్రపతి ;  రూ.1.25లక్షలు

గవర్నర్      ;   రూ.1.10లక్షలు

రాష్ట్రం               ముఖ్యమంత్రి            మంత్రులు              ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్         రూ.2.4లక్షలు               -                  రూ.1.25లక్షలు

తెలంగాణ          రూ.4.21లక్షలు              -                  రూ.2.50లక్షలు

మహారాష్ట్ర          రూ.2.25లక్షలు      రూ.2.05లక్షలు       రూ.1.70లక్షలు

ఉత్తరాఖండ్        రూ.2.50లక్షలు        -                      రూ.1.60లక్షలు

ఉత్తరప్రదేశ్         రూ.1.01లక్షలు          -                     రూ.75వేలు

మధ్యప్రదేశ్        రూ.2.00లక్షలు          -                    రూ.1.10లక్షలు

ఢిల్లీ                రూ.1.20లక్షలు        రూ.1.20లక్షలు      రూ.88వేలు

తమిళనాడు       రూ.1                          -                 రూ.55వేలు

పశ్చిమబెంగాల్   జీతం తీసుకోరు               -                 రూ 42వేలు

ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లోని అంశాల్నిఇక్కడ ప్రస్తావించాలి. ఢిల్లీ క్యాబినెట్ ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మంత్రుల జీతం రూ.3.20లక్షలకు.. ఎమ్మెల్యేలకు రూ.2.10లక్షలు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. దీన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది. అదే రీతిలో మహారాష్ట్రలో మంత్రుల జీతాల్ని 250 శాతం.. ఎమ్మెల్యేల జీతాల్ని 126 శాతం పెంచాలని అసెంబ్లీ బిల్లుపాస్ చేసింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి.

మిగిలిన మంత్రులందరిలోకి పశ్చిమబెంగాల్.. తమిళనాడు ముఖ్యమంత్రుల తీరు కాస్త భిన్నంగా. తమిళనాడు ముఖ్యమంత్రి తన జీతాన్ని రూపాయిగా ఫిక్స్ చేసుకుంటే.. బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా జీతం రూపంలో తీసుకోలేదు. నెలవారీ వచ్చే వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తారు. సీఎం గానే కాదు.. ఎమ్మెల్యేగా కూడా ఆమె ఇప్పటివరకూ ఒక్కరూపాయి జీతం తీసుకోకపోవటం గమనార్హం.
Tags:    

Similar News