వాదనలు అయ్యాయి.. సల్లూకు కష్టాలేనా?!

Update: 2015-04-09 05:39 GMT
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ఖాన్‌ పరిస్థితి ఏమవుతుందో అభిమానులకు అర్థం కావడం లేదు. దాదాపు పన్నెండేళ్ల కిందటి వ్యవహారంలో ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. పేవ్‌మెంట్‌ మీద నిద్రిస్తున్న వారిపై కారెక్కించి ఒకరి మరణానికి కారణం అయ్యాడనే ఆరోపణలున్నాయి ఈ హీరో మీద. అయితే ఈ కేసు ఎంతకూ తెమలడం లేదు.

    ప్రస్తుతం విచారణ ఊపందుకొన్న నేపథ్యంలో దీన్నుంచి బయటపడటానికి సల్మాన్‌ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు కారు నడిపింది తాను కాదని..సల్మాన్‌ స్పష్టం చేస్తున్నాడు. అశోక్‌సింగ్‌ అనే తన డ్రైవర్‌ కారు నడిపాడని అంటున్నాడు. ఈ విషయాన్ని అశోక్‌సింగ్‌ కూడా ఒప్పుకొంటున్నాడు.

    ఇలాంటి నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌ వాదన మాత్రం మరో రకంగా ఉంది. ఉన్నట్టుండి డ్రైవర్‌ను తెరపైకి తెచ్చారని.. అసలు ఆ రోజు డ్రైవర్‌ కారుతో లేడని, అశోక్‌సింగ్‌ అబద్ధం చెబుతున్నాడని పోలీసుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.

    సల్మాన్‌ తాగి ఉన్నాడనేది నిజం అని.. అలాగే కారు పంక్చర్‌ అయ్యింది, దాని వల్లనే పేవ్‌మెంట్‌ మీదకు దూసుకెళ్లింది అనేది అబద్ధమని.. డ్రైవర్‌ను అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెబుతూ సల్మాన్‌ ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నాడని ప్రాసిక్యూషన్‌ వాదిస్తోంది.

    ఈ ప్రమాదానికి, వ్యక్తి మరణానికి తాను కారణం కాదనే వాదనతో సల్మాన్‌ రకరకాల విషయాలను చెబుతున్నాడు.. అవన్నీ అబద్దాలూ అంటూ ప్రాసిక్యూషన్‌ వాదిస్తోంది. మరి ఈ రెండింటిలో కోర్టు ఎవరి వాదనను పరిగణనలోకి తీసుకొంటుందో... ఎలాంటి తీర్పునిస్తుందో, సల్మాన్‌ భవితవ్యం ఏమిటో!
Tags:    

Similar News