చైనాకు షాకిచ్చిన శాంసంగ్..భారత్ కు మాత్రం వరమే?

Update: 2019-10-03 04:31 GMT
దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన శాంసంగ్ తాజాగా తీసుకున్న నిర్ణయం డ్రాగన్ దేశానికి షాకిచ్చేలా ఉందని చెబుతున్నారు. చైనాలో తమకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. ఆ దేశంలో తమ మొబైల్ ఫ్లాంట్ ను మూసేయాలన్న నిర్ణయాన్ని శాంసంగ్ తీసుకోవటం చైనాకు షాకేనంటున్నారు. ఎందుకంటే.. గత ఏడాది ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాల్ని నిలిపేసిన శాంసంగ్.. ఈ జూన్ లో రెండో ఫ్యాక్టరీని మూసేసింది. తాజాగా మరో ఫ్లాంట్ ను మూసేయటం ద్వారా చైనాలో తన మొబైళ్ల తయారీని నిలిపేసినట్లు అయ్యింది.

చైనాలో మూసేసిన ప్లాంట్లను వియత్నాం.. భారత్ లో తమ ఫ్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా పథకాల్ని రూపొందించటం గమనార్హం.  ఎందుకిలా? అంటే.. చైనాలోని పరిస్థితులే కారణంగా చెబుతోంది. పెరుగుతున్న వ్యయాల్ని అదుపులోకి తీసుకురావటం.. ఆర్థిక మందగమనం.. తీవ్రమైన పోటీ నేపథ్యంలో చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఆ దేశం నుంచి తరలి వెళ్లిపోతున్నాయి. శాంసంగ్ కు ముందుగా సోనీ కంపెనీ కూడా చైనాకు గుడ్ బై చెప్పేసింది.

అయితే.. చైనాలో తమ ఉత్పత్తి కార్యకలాపాల్ని ఆపేసినా.. అమ్మకాలు మాత్రం యథాతధంగా ఉంటాయని చెబుతోంది.  చైనాలో శాంసంగ్ కు దేశీయ కంపెనీ అయిన హువావే టెక్నాలజీస్.. షావోమీ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు దేశీయ ఫోన్లను కొనేయటం.. ఖరీదైన ఫోన్లు కొనాలనుకునే వారు హువావే.. యాపిల్ ఫోన్లను కొనటం షురూ చేయటంతో శాంసంగ్ సేల్స్ పడిపోయాయి.

దాదాపు ఆరేళ్ల క్రితం చైనా మొబైల్ అమ్మకాల్లో శాంసంగ్ వాటా 15 శాతం ఉంటే.. ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశం లేకపోవటంతో తన ప్లాన్ ను మార్చేసిన సంస్థ.. చైనాలో తన మొబైళ్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పెద్ద కంపెనీలు చైనాను వీడిపోవటం ఈ మధ్యన ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తూ ఉండటం గమనార్హం.


Tags:    

Similar News