కోట్లు పోయినా ట‌న్నుల బంగారం మిగిలింది

Update: 2017-07-23 08:15 GMT
తిరుగులేని విజ‌యాల‌తో దూసుకెళుతున్న ప్ర‌ఖ్యాత ఫోన్ కంపెనీ శాంసంగ్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్‌ చేసేలా చేసింది గెలాక్సీ నోట్ 7. శాంసంగ్ నుంచి ఫోన్ వ‌స్తుందంటే ఉండే క్రేజ్ సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. బ్యాట‌రీలో చోటు చేసుకున్న లోపం కార‌ణంగా.. దీపావ‌ళి ట‌పాకాయ‌లు పేలిన‌ట్లుగా సెల్ ఫోన్లు పేలిపోవ‌టంతో శాంసంగ్ ప‌రువు ప్ర‌తిష్ట‌లు ప్ర‌పంచవ్యాప్తంగా మ‌స‌క‌బారాయి.

గెలాక్సీ నోట్ 7 స‌ద‌రు కంపెనీకి చుక్క‌లు చూపించ‌ట‌మే కాదు.. వేలాది కోట్ల రూపాయిలు న‌ష్టం మూట‌గ‌ట్టుకునేలా చేయ‌టంతో పాటు.. ఆ సంస్థ ప్ర‌తిష్ఠ‌ను దారుణంగా దెబ్బ తీసింది. ఒక‌ద‌శ‌లో నోట్ 7 దెబ్బ‌కు శాంసంగ్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది కూడా. కంపెనీని ఇంత‌లా న‌ష్ట‌పోయేలా దెబ్బ తీసిన నోట్ 7తో శాంసంగ్‌ కు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదా? అంటూ కాస్తంత ఉందంటున్నారు.

అదెలానంటే.. ప్ర‌పంచ దేశాలకు అమ్మిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల‌ను తిరిగి సేక‌రించి.. వాటిని రీసైకిల్ చేశారు. ఇలా చేయ‌టం ద్వారా దాదాపు 157 ట‌న్నుల బంగారం.. వెండి.. కోబాల్ట్‌.. రాగి లాంటి విలువైన లోహాల్ని శాంసంగ్ మిగుల్చుకోనున్న‌ట్లుగా తెలుస్తోంది. జులై నుంచి మొద‌లు కానున్న ఈ ప్ర‌క్రియలో భాగంగా.. ఫోన్ లోని కొన్ని భాగాల్ని వేరు చేసి భ‌ద్ర‌ప‌ర్చ‌నున్నారు.

బ్యాట‌రీ లోపం ఉన్న ఈ ఫోన్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లే.. మెమొరీ సెమీ కండ‌క్ట‌ర్లు.. కెమేరా మాడ్యూల్స్ ను వేరు చేసి భ‌ద్ర‌ప‌ర్చ‌నున్నారు. ఇక‌.. అమ్ముడు  కాని ఫోన్ల‌ను తిరిగి సేక‌రించిన కంపెనీ.. నోట్ 7 బ్యాట‌రీ స్థానంలో స‌రికొత్త త‌ర‌హా బ్యాట‌రీని అభివృద్ధి చేశారు. ఆ కొత్త బ్యాట‌రీని అమ‌ర్చ‌టం ద్వారా ఎఫ్ ఈ పేరుతో తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చి.. జ‌రిగిన న‌ష్టాల్ని వీలైనంత త‌క్కువ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున తిరిగి తీసుకొచ్చిన ఫోన్ల‌ను.. రీసైక్లింగ్ చేసే ప్ర‌క్రియ మొత్తాన్ని ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని లేని ప్ర‌క్రియ‌ను అమ‌లు చేస్తున్నారు. న‌ష్టంలోనూ ఎంతోకొంత లాభం అంటే ఇదేనేమో?
Tags:    

Similar News