త‌మిళ‌నాట యూట‌ర్న్‌: పెరోల్‌ కి శ‌శి అప్లై

Update: 2017-10-02 10:45 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకోబోతున్నాయా?  ప్ర‌స్తుతం ప‌రిస్థితి చ‌క్క‌బ‌డింద‌ని, పాల‌న స‌జావుగా సాగుతుంద‌ని భావిస్తున్న త‌రుణంలో మ‌రో తుఫాను ఎదురవ‌బోతోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైల్లో ఉన్న అన్నాడీఎంకే(అమ్మ‌) అధ్య‌క్షురాలు శ‌శిక‌ళ‌(ప‌ళ‌ని - ప‌న్నీర్ వ‌ర్గాలు ఈమెను ప‌ద‌వుల నుంచి పార్టీ నుంచి తొల‌గించాయ‌నుకోండి) త్వ‌ర‌లోనే పెరోల్‌ పై బ‌య‌ట‌కు రానున్నార‌ని ఆమె బంధువు - టీటీవీ దిన‌క‌ర‌న్ బాంబు పేల్చారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి జ‌య మ‌ర‌ణం - శ‌శి జైలు ప్ర‌యాణం త‌ర్వాత త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు తీవ్రంగా మారిపోయాయి. ప‌న్నీర్ వ‌ర్గం చీలిపోయింది. శ‌శిపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. అయితే, అదేస‌మ‌యంలో శ‌శి సీఎం పీఠం అప్ప‌గించిన ప‌ళ‌ని స్వామి కూడా చిన్న‌మ్మ‌ను ప‌క్క‌కు నెట్టి ప‌న్నీర్‌ తో జ‌త‌క‌ట్టి.. పార్టీ ప‌ద‌వుల నుంచి శ‌శిని దారుణంగా వెళ్ల‌గొట్టారు. ఇప్పుడు శ‌శికిపార్టీలో ఎలాంటి ప‌ద‌వులూ లేవు. అంతేకాదు, అమ్మ జ‌య ఉండ‌గా.. పోయెస్ గార్డెన్‌ కు అధిప‌తిగా వ్య‌వ‌హ‌రించిన శ‌శి ఇప్పుడు ఆ ఛాయ‌ల‌కు కూడా వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం దానిని స్వాధీనం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించి క‌నీవినీ ఎరుగ‌ని భ‌ద్ర‌త క‌ల్పించారు. పోయెస్ గార్డెన్ ఉన్న వీధిలోకి వెళ్లాల‌న్నా స‌వాల‌క్ష అనుమ‌తులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

దీంతో ఈపరిణామం శ‌శికి ఆమె వ‌ర్గానికి మింగుడుప‌డ‌డం లేదు. మ‌రోప‌క్క‌, దిన‌క‌ర‌న్‌ - శ‌శి వ‌ర్గంగా మారిన ఎమ్మెల్యేల‌పై వేటుకు స్పీక‌ర్ రెడీ అయ్యారు. వీరిపై వేటు ప‌డినా ప్ర‌భుత్వానికి ఢోకా ఉండ‌ద‌ని ప‌ళ‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇలా త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మంచి వేడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో శ‌శి ఉంటే బాగుండేద‌ని ఆమె వ‌ర్గం ఎమ్మెల్యేలు భావించారు. అయితే, ఆమె జైలు నుంచి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌థ‌నాలు న‌డిచాయి. అయితే, హ‌ఠాత్తుగా ఆమెకు ఆమె భ‌ర్త రూపంలో పెద్ద ఊర‌ట ల‌భించింది.

శ‌శి భ‌ర్త న‌ట‌రాజ‌న్‌ గత కొంత కాలంగా కాలేయం - మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు.   గ్లెనెగిల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ ఆసుపత్రిలో డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని దినకరన్ తెలిపారు. త్వ‌ర‌లోనే దీనిపై జైలు అధికారులు నిర్ణ‌యం తీసుకుంటార‌ని, ఆమె క‌నీసం 15 రోజులు త‌మిళ‌నాడులో ఉంటార‌ని ఆమె వ‌ర్గం నేత‌లు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రోసారి ప‌తాక శీర్షిక‌లకు ఎక్కే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News