అన్నాడీఎంకేలోకి శశికళ ఎంట్రీ?

Update: 2021-03-25 10:54 GMT
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్ని సర్వేల్లో తేలిపోయింది. జయలలిత స్నేహితురాల శశికళని ప్రస్తుతానికి పార్టీలోకి రాకుండా సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు. బీజేపీ అండదండలతో చెక్ పెట్టారన్న ప్రచారం ఉంది..అయితే వీరి వల్ల పార్టీ నిలబడదని ఓ క్లియర్ కట్ మెసేజ్ బీజేపీకి రావడంతో శశికళను ఎంట్రీ చేయడమే మెరుగైన మార్గం అని కమలదళం భావిస్తోందట..

తాజాగా డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం శశికళ పట్ల సానుకూలత కనబరిచేలా వ్యాఖ్యలు చేశారని.. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఆయన అలా మాట్లాడారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకేలోకి రావాలన్న శశికళ కోరికను మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని పన్నీర్ సెల్వం అనడం సంచలనమైంది. ఆమె చేరిక విషయాన్ని పరిశీలించాలని కోరడం అన్నాడీఎంకేలో చర్చనీయాంశమైంది. ఓపీఎస్ వ్యాఖ్యలు ప్రస్తుతం అన్నాడీఎంకేలో కలకలం రేపుతున్నాయి.

ఈ వ్యాక్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫళని స్వామి బుధవారం ఉదయం సేలంలోని ఓ హోటల్ లో ఓపీఎస్ తో భేటి అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు చర్చించారు. పార్టీలో శశికళ రాకను వ్యతిరేకిస్తున్న ఫళని స్వామి దీనిపై పన్నీర్ సెల్వంను వివరణ అడిగినట్లు సమాచారం. వీరి భేటి అభిప్రాయబేధాలతోనే ముగిసినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిశాక అన్నాడీఎంకేలోకి శశికళ చేరడం ఖాయం అంటున్నారు. ఈ మేరకు ముందస్తు వ్యూహంలో భాగంగానే పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

శశికళ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఆమెను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు పన్నీర్, ఫళని స్వామిలను చెబుతూ వచ్చారట.. అయితే పన్నీర్ అంగీకరించినా సీఎం ఫళని స్వామి వ్యతిరేకించారు. కానీ బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆయనను కూడా ఒప్పించినట్టు సమాచారం. ఈ మేరకు ముందస్తు వ్యూహంలో భాగంగానే పన్నీర్ సెల్వం శశికళను పార్టీలోకి చేర్చుకోవాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చినట్టు తమిళ రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.


Tags:    

Similar News