ఎరుపెక్కిన కళ్లతో చిన్నమ్మ ఏమన్నారంటే..

Update: 2017-02-13 04:49 GMT
నిన్న మొన్నటి వరకూ అభివాదాలు చేయటం.. మౌనంగా ఉండటం చేసే చిన్నమ్మ తాజాగా గొంతు విప్పారు. తన మనసులో రేగుతున్న బడబాగ్నిని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా చేతివరకూ వచ్చి.. చేజారిపోతుందన్న మాట వినిపిస్తున్న సీఎం కుర్చీ వ్యవహారం తనను ఎంతగా హర్ట్ చేసిందన్న విషయాన్ని ఆమె ఏ మాత్రం దాచుకోలేదు. మొన్నటి వరకూ విదేయుడిగా వ్యవహరించిన వ్యక్తి.. ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేయటమ కాదు.. చుక్కలు చూపిస్తున్న వైనంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదంతా ఢిల్లీ కుట్ర పుణ్యమేనని ఫైర్ అవుతూనే.. కంటతడి పెట్టిన చిన్నమ్మ వైఖరితో ఆమె వర్గీయులంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎరుపెక్కిన కళ్లతో కంట కన్నీరు ధారలు కడుతున్న వేళ.. గంటకు పైగా ఆమె తన మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాటల తూటాల్ని విసిరారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది చూస్తే..

= ‘‘జయతో ఎన్నో కష్టాలు అనుభవించా. చెన్నై జేలు కొత్త కాదు. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచే బయటకు వచ్చాం. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నాం. మహిళ అనుకొని భయపెట్టి.. అణగదొక్కాలని చూస్తే అమ్మ లానే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు రెఢీ. ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్నుఎవరూ ఏమీ చేయలేరు’’

= ‘‘ఎవరెన్ని కుట్రలు చేసినా.. కుతంత్రాలు పన్నినా వాటిని ఎదుర్కొనే దమ్ము.. ధైర్యం నాకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అమ్మ చేతల మీదుగా మహాశక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చా. కోపం ముఖ్యం కాదు. కర్తవ్యం ముఖ్యం. అమ్మ సమాధి వద్దకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యా. అక్కడి నుంచి బయటకు రాలేకపోయా. ఇక్కడికి వచ్చాక ఆ భారం కాస్త తగ్గింది. ఇక్కడున్న మీరంతా సింహాలే. మీతోపాటు నేనూ ఒక సింహమే’’

= ‘‘భయపెట్టటం తప్ప మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయితే.. మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. మనమంతా ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి. తమిళ ప్రజల సంక్షోభం కోసమే అమ్మ అధికారాన్ని మనకు అప్పగించి వెళ్లారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నేను మాత్రమే కాదు.. మీరంతా శ్రమించాలి. మూడోసారి ఎన్నికల్లోనూ మనకే అధికారం కట్టబెట్టేలా పని చేయాలి. ఒక శక్తిగా మారాలి. సుపరిపాలనతో ప్రజల మనసుల్ని గెలుచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్ని చేజిక్కించుకొని అమ్మ సమాధి వద్ద కానుకగా సమర్పిద్దాం’’

= మనందరి ముందు పెద్ద బాధ్యత ఉంది. అమ్మ ఫోటో ముందు శపధం చేద్దాం. 125 మంది నేరుగా అమ్మ సమాధి వద్దకు వెళదాం. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోకి అడుగుపెడదాం. అసెంబ్లీ లోపలఅమ్మ ఫోటో పెట్టున్నా. ఇది ఖాయం. మీరంతా నా వెంట ఉండే నాకు కోటిమందితో సమానం’’

= ‘‘ప్రతిపక్ష డీఎంకే గురించి మీకెవరికీ తెలీదు. వారెన్ని కుట్రలు చేస్తున్నారు. వాటిని ఎదుర్కొందాం. అమ్మ ఫోటో అసెంబ్లీలో ఉండాల్సిందే. ఈ నిర్ణయంలో మరో మాటకుతావు లేదు’’

= ‘‘మన చేతితో మన కళ్లను పొడిచే విధంగా పన్నీర్ సెల్వం కుట్రలు పన్ని పార్టీకి కళంకం తెచ్చారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఆయన కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. నమ్మకం.. విధేయత అని చెప్పుకుంటూ ఎప్పుడు ఎందుకోసం తిరుగబాటు చేశారు? సమస్యలు తీవ్రమైతే.. వాటిని ఎదుర్కొనేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమే’’
Tags:    

Similar News