జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్...శ్రీకాకుళం జిల్లా లో పోరాట యాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. హఠాత్తుగా మొదలెట్టిన ఈ పోరాట యాత్రలో టీడీపీ - వైసీపీలపై పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో తనకు అధికార వ్యామోహం లేదన్న పవన్....తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని....తనకు ఓటేసి సీఎంను చేయాలని కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు ఏపీలోని 175 నియోజక వర్గాల్లో ఇన్ చార్జిలనే నియమించని పవన్....2019లో ఎలా అధికారం చేపడతారన్నది భేతాళ ప్రశ్న. ఆ సంగతి కాసేపు పక్కనబెడితే....నిర్విరామంగా పోరాట యాత్రను కొనసాగించటానికి నానా తిప్పలు పడుతోన్న పవన్...ఒకవేళ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాన్ని ఎలా నడిపించగలరనే సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయంటే అతిశయోక్తి కాడు. తన బౌన్సర్లు గాయపడ్డారన్న సాకుతో ...రెండురోజులుగా యాత్రకు పుల్ స్టాప్ పెట్టిన పవన్....నేడు నిరాహార దీక్ష పేరుతో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రాణాలర్పించేందుకు సిద్ధం అని ప్రకటించిన పవన్....భద్రతా కారణాల రీత్యా యాత్రను వాయిదా వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
విశ్వవిఖ్యాత నటుడు - నందమూరి తారకరామారావు....టీడీపీని స్థాపించిన తర్వాత...చైతన్యరథంపై ఏపీ మొత్తం నిర్విరామంగా చుట్టేశారు. రోడ్డు పక్కనే బస చేస్తూ....యాత్రను ఏనాడు ఆపలేదు. మరోపక్క ఏపీ ప్రతిపక్షనేత జగన్ అలుపెరగకుండా నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్నారు. శుక్రవారం నాడు కోర్టుకు హాజరయ్యేందుకు మినహాయిస్తే మరేరోజు యాత్ర ఆపడం లేదు. అటువంటిది...పవన్...యాత్ర మొదలెట్టిన పది రోజులకే రకరకాల కారణాలతో 3 రోజులు బ్రేక్ ఇచ్చారు. రోడ్డు పక్కన కాకుండా....రిసార్ట్ లలో బస చేస్తోన్న పవన్....రెస్ట్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బస చేసిన రిసార్ట్ వద్ద కొందరు వచ్చి గొడవ చేశారని, వారితో పవన్ బౌన్సర్లు గొడవకు దిగడంతో గాయాలయ్యాయని టాక్. ఒక యాత్రను ప్రణాళికా బద్ధంగా నిర్వహించలేకపోయిన పవన్ రాష్ట్రాన్ని ఏవిధంగా నడుపుతారని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా...మాటల్లో పవన్ చూపిస్తున్న జోష్....చేతల్లో కూడా చూపించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీటికి జనసేనాని , ఆయన సైనికుల స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.