సౌదీ షాకింగ్ డెసిష‌న్‌: క్రీడ‌గా యోగా

Update: 2017-11-15 07:24 GMT
ప‌క్కా ముస్లిం కంట్రీ సౌదీ అరేబియాలో అక్క‌డి పాల‌కులు భార‌తీయ యోగాకు పెద్ద‌పీట వేశారు. యోగా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు క‌లిగే లాభాల‌ను గుర్తించారు. వెంట‌నే దీనిని దేశ‌వాప్తంగా ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. యోగాను ఆధ్యాత్మిక అంశంతో కాకుండా ఓ క్రీడాంశంగా ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. యోగా అభ్య‌స‌నానికి, యోగా శిక్ష‌ణ‌కు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేయ‌నుంది. ఈ మేర‌కు సౌదీ వాణిజ్య‌, పారిశ్రామిక‌ మంత్రి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. క్రీడాంశాల్లో భాగంగా యోగాను గుర్తించిన‌ట్టు మంత్రి చెప్పారు. సౌదీ పౌరులు యోగా సాధ‌న చేసేందుకు, యోగా శిక్ష‌ణ ఇచ్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు. అయితే, దీనికి సంబంధించి ప్ర‌భుత్వం నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంద‌న్నారు. కాగా, ఈ ఏడాది సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సౌదీ పాల‌కుడు.. తాజాగా యోగాపై వెలువ‌రించిన నిర్ణ‌యం ముస్లిం దేశాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

``నేను అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు యోగా సాధ‌న చేశాను. దీంతో ఆ అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. అప్ప‌టి నుంచి యోగాపై ఆస‌క్తి పెరిగింది`` అని 37 ఏళ్ల న‌వూఫ్ మార్వాయీ వెల్ల‌డించారు. యోగాపై ఆమె సౌదీ అరేబియాలో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం కూడా యోగా ప్రాధాన్యత‌ను గుర్తించింది. మంగ‌ళ‌వారం అధికారికంగా యోగాను క్రీడాంశంగా గుర్తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 2005 నుంచి న‌వూఫ్ ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని వేల మంది సౌదీ పౌరుల‌కు యోగా ప్రాముఖ్యాన్ని వివ‌రించారు. దీనిలో వారికి శిక్ష‌ణ కూడా ఇచ్చారు. ఇకపై ఆమె ప్ర‌భుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని యోగాను మ‌రింతగా విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌ట్లో అధికారుల‌ను సంప్ర‌దించినా యోగా విష‌యాన్ని వారు ప‌ట్టించుకోలేదు.

చివ‌రికి ఆమె సౌదీ రాకుమారుడిని క‌లిసి యోగా ప్రాముఖ్యాన్ని వివ‌రించింది. అప్ప‌టికే పురుషుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన బాస్కెట్ బాల్ క్రీడ‌ను మ‌హిళ‌లు సైతం ఆడేలా స‌రికొత్త మార్పులు తెచ్చిన రాకుమారుడు యోగా విష‌యంలోనూ ఆసక్తిగా స్పందించారు. ఇటీవ‌లే మ‌హిళ‌లు కార్లు న‌డుపుకొనేందుకు అనుమ‌తులు మంజూరు చేయించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యోగాను క్రీడాంశంగా ప్రోత్స‌హించేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పార‌ని న‌వూఫ్ చెప్పుకొచ్చారు. ఇక‌, భార‌త్‌లో యోగా శిక్ష‌ణ ఇస్తున్న ముస్లిం మ‌హిళ‌పై అక్క‌డి ముస్లింలు ఫ‌త్వా జారీ చేసిన నేప‌థ్యంలో.. ముస్లిం దేశంగా పేరొందిన సౌదీలో యోగాకు పెద్ద పీట వేయ‌డం మంచి సందేశాన్ని ఇచ్చింద‌న్నారు.
Tags:    

Similar News