ఏపీ ఆర్థిక స‌ల‌హాదారుగా ఎస్బీఐ మాజీ చీఫ్ ర‌జ‌నీష్ కుమార్‌

Update: 2021-09-07 10:59 GMT
ఏపీ ప్రభుత్వంలో మరో సలహాదారు నియమితులయ్యారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉంద‌ని, ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం నిర్వహించలేకపోతోందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తరచూ విమర్శలను సంధిస్తోన్నారు. వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొస్తున్నారి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేస్తోందని మండిపడుతున్నారు. నవరత్నాలను అమలు చేయడానికి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకొచ్చి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టస్తోందనే విమర్శలు, ఆరోపణలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

అదే సమయంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందని, వైసీపీ నేతల తీరు వల్ల ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తోన్నాయనే ఆరోపణలు ష‌రా మామూలుగా మారాయి. ఈ పరిణామాల నేప‌థ‌యంలో సీఎం జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ రజినీష్ కుమార్‌ను సలహదారుగా నియమించారు. ఆర్థిక వ్యవహారాలను ఆయనకు అప్పగించారు. సీనియ‌ర్ నాయ‌కుడు బుగ్గన రాజేంద్రనాథ్ బాధ్య‌త వ‌హిస్తున్న‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహదారుగా రజినీష్ కుమార్‌ను నియమించారు. రజినీష్ కుమార్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కొనసాగుతారు.

ఆ తరువాత ఆయన హోదాను పొడిగించడమా? లేదా? అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాగా- ఏపీ ప్రభుత్వం తనను ఆర్థిక వ్యవహారాల సలహదారుగా నియమించిన విషయాన్ని రజినీష్ కుమార్ ధృవీకరించారు. ఆర్థిక నిపుణుడిని సలహాదారుగా నియమించాలనే కారణంతో ఏపీ ప్రభుత్వం తనను సంప్రదించిందని చెప్పారు. ఆర్థిక సలహదారుగా నియమిస్తామని చెప్పగా.. తాను అంగీకరించినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం రజినీష్ కుమార్ కొన్ని ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకులకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన కోటక్ స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్‌కు ఎక్స్‌క్లూజివ్ అడ్వైజర్‌గా, హెఎస్‌బీసీ ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఇక‌, ప్ర‌స్తుతం జగన్ సర్కార్ కూడా ఆయనను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేలా చేయడం, దీనికి సంబంధించిన సంప్రదింపులను కార్పొరేట్ కంపెనీలతో కొనసాగించడం వంటి కార్యకలాపాలను ఇకపై రజినీష్ కుమార్ పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నందున.. వాటిని అలాగే కొనసాగిస్తూ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపైనా రజినీష్ కుమార్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ప్ర‌స్తుతం ఇబ్బందిగా ఉన్న ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News