వారికి బెయిల్ ,పెరోల్ ఇచ్చేయండి .. సీజేఐ రమణ సంచలన ఆదేశాలు!

Update: 2021-05-08 11:36 GMT
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోన్న సమయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ గడిచిన రెండు వారాలుగా మానవహక్కుల కోణంలో కీలక తీర్పులు, ఆదేశాలు వెలువర్చడంతోపాటు, మహమ్మారి నిర్వహణలో విఫలమైన మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఖైదీల భద్రత, కరోనా సమయంలో పోలీసుల ఓవరాక్షన్ తదితర అంశాలపై సీజేఐ రమణ నేతృత్వం జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోన్న వేళ దేశంలోని జైళ్లలో ఖైదీలు కిక్కిరి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో రద్దీని తగ్గించేలా పెద్ద ఎత్తున ఖైదీల విడుదల కోసం సీజేఐ రమణ బెంచ్ శనివారం ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రస్తుతం జైళ్లలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్న కోర్టు, బెయిల్, పెరోల్ కు అవకాశం ఉన్న అందరు ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఖైదీల స్థితిగతులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హై పవర్డ్‌ కమిటీల ఆధ్వర్యంలో విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని హైపవర్డ్ కమిటీల ఆధ్వర్యంలో విడుదలయ్యే ఖైదీల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లలో అప్ డేట్ చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గతేడాది తొలి వేవ్ సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా అర్హులైన ఖైదీలందరికీ బెయిల్, పెరోల్ మంజూరు చేయాలని, గత జాబితాలోని వారిని కచ్చితంగా విడుదల చేస్తూనే, కొత్త వారి పేర్లనూ విడుదల జాబితాలో చేర్చాలని సుప్రీం ఆదేశించింది.

గత ఏడాది మహమ్మారి తీవ్రత కారణంగా విడుదలైన ఖైదీల్లో తొంభై శాతం మంది నిబంధనల ప్రకారం మళ్లీ కారాగారాలకు చేరిన సంగతిని ధర్మాసనం గుర్తుచేసింది.కరోనా వేళ జైళ్లలో పరిస్థితిని సమీక్షించిన సీజేఐ బెంచ్ ఖైదీలకు సంబంధించిన అంశాలతోపాటు కొత్త అరెస్టులపైనా సంచలన ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జైళ్లలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి చిన్న చిన్న నేరాలు.. అంటే, ఏడాదిలోపు మాత్రమే శిక్షపడే అవకాశాలున్న కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేయరాదని, కచ్చితంగా అత్యవసరం అనుకుంటేనే నిందితులను రిమాండ్ కు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 
Tags:    

Similar News