న‌మ్మ‌లేని నిజం..మార్కెట్లోకి బొద్దింక పాలు

Update: 2018-05-31 05:21 GMT
ఛీ..ఛీ.. యాకీ లాంటి మాట‌లు బొద్దింక పేరు చెబితే చ‌టుక్కున నోటి నుంచి వ‌స్తాయి. అలాంటిది ఏకంగా బొద్దింక పాలు తాగ‌ట‌మా?  మ‌తి ఉండే మాట్లాడుతున్నారా? అన్న కోపం అక్క‌ర్లేదు. విష‌యం మొత్తం తెలిస్తే మీరు కూడా బొద్దింక పాలు తాగే దాని గురించి ఆలోచించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఇంత‌కీ ఈ బొద్దింక పాలేంటి?  దాని కోసం జ‌నాలు ఎందుకంత త‌పించాల్సి ఉంటుంది?  అన్న విష‌యాల్లోకి వెళితే..

గేదె పాలు.. ఆవు పాలు.. ఇలా ఇప్ప‌టికే కొన్ని పాలు మార్కెట్ల‌లో ద‌ర్శ‌న‌మిస్తాయి. మ‌రో ప‌ది.. ప‌దిహేనేళ్ల‌కు వీటి మాదిరే బొద్దింక పాలు అంటూ ప్యాకెట్లు.. ప్యాకెట్లు ద‌ర్శ‌న‌మివ్వ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇప్పుడు అస‌హ్యంతో నొస‌లు చిట్లించొచ్చు ఏమో కానీ.. ఫ్యూచ‌ర్లో మాత్రంస్టైల్‌గా బొద్దింక పాలు తాగుతామ‌ని చెప్పుకోవ‌చ్చ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న చేసిన ప‌రిశోధ‌న‌ల్లో బొద్దింక పాలు భేష్ అన్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు.

ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే.. ఇప్పుడు అందుబాటులో ఉండే పాల‌తో పోలిస్తే.. బొద్దింక పాల‌ల్లో పోష‌కాలు ప్ర‌పంచంలో ఇప్ప‌టివ‌ర‌కూ ల‌భించే పాల‌ల్లో ఉండ‌వ‌ని తేల్చారు. అదేంటి?  బొద్దింక‌లు గుడ్లు పెడ‌తాయి క‌దా?  ఈ పాల గోలేంటి? అన్న క్వ‌శ్చ‌న్ రావొచ్చు. అక్క‌డికే వ‌స్తున్నాం. ఇప్పుడు చెప్పిన బొద్దింక పాలు అన్ని బొద్దింక‌ల్లో ఉండ‌వు. కేవ‌లం ఆస్ట్రేలియా.. హ‌వాయి.. భార‌త్ చైనా లాంటి కొన్ని దేశాల్లో మాత్ర‌మే ల‌భిస్తాయ‌ట‌. అత్య‌ధిక పోష‌కాలున్న పాల‌ను ఇచ్చే బొద్దింక పేరు ప‌సిఫిక్ బీటిల్ బొద్దింక‌గా చెబుతున్నారు.

అవి మ‌నుషుల మాదిరే త‌మ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తాయ‌ట‌. పిల్ల‌ల్ని క‌నే టైంలో గ‌ర్భంలోని త‌మ పిల్ల‌ల‌కు లేత ప‌సుపు రంగులో ఉండే పాల లాంటి ద్ర‌వాన్ని ఆహారంగా అందిస్తాయ‌ట‌. ఆ పాల‌లో ఉండే ప్రోటీన్ క్రిస్ట‌ల్స్ లో పోష‌కాల నిధి దాగి ఉన్న‌ట్లుగా గుర్తించారు. ఆవు.. గేదె లాంటి పాల‌కు మూడు నాలుగు రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఈ త‌ర‌హా బొద్దింక‌ల పాల‌ల్లో ఉంటాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ లియోనార్డ్ చ‌వాస్ స్ప‌ష్టం చేస్తున్నారు.

పాలిచ్చే స్పెష‌ల్ బొద్దింక‌ల పాల‌లో అన్ని ర‌కాల అమినో యాసిడ్లు.. కేల‌రీలు.. లిపిడ్స్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. బెంగ‌ళూరుకు చెందిన స్టెమ్ సెల్ బ‌యాల‌జీ సంస్థ సైతం బొద్దింక‌ల పాల మీద ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. అయితే.. వీటి నుంచి పాల‌ను సేక‌రించ‌టం చాలా క‌ష్ట‌మైన ప‌నిగా చెబుతున్నారు. ఆడ బొద్దింక‌కు 40 రోజుల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ ద్ర‌వ విడుద‌ల చేయ‌టం షురూ చేస్తుంద‌ట‌.

ఆ టైంలో దాన్ని కోసి ప్రోటీన్ క్రిస్ట‌ల్స్ ను సేక‌రించాల్సి ఉంటుంది. అలా ఒక బొద్దింక నుంచి సేక‌రించే క్రిస్ట‌ల్స్ చాలా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. మ‌రింత అర్థ‌మ‌య్యేలా చెప్పాలంటే వంద గ్రాముల బొద్దింక‌ల పాల క్రిస్ట‌ల్స్ కోసం ఏకంగా వెయ్యి బొద్దింక‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఈ నేప‌థ్యంలో బొద్దింక పాల గుణాలతో కృత్రిమ ప‌ద్ధ‌తిలో పాల‌ను త‌యారు చేయ‌టానికి ఉన్న అవ‌కాశాల మీద ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌యోగ‌శాల‌లోనే.. బొద్దింక పాల‌ల్లో ఉండే ప్రోటీన్లు మిస్ కాకుండా చేస్తే.. ఇక ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు.

ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాకున్నా.. రానున్న రోజుల్లో బొద్దింక పాలు మార్కెట్ల‌ను ముంచెత్త‌టం ఖాయ‌మ‌ని.. జ‌నాలు వాడ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. స‌ర్లే.. బొద్దింక‌ల పాల మీద మోజు పెంచుకోవ‌టానికి చాలానే సంవ‌త్స‌రాల టైం ఉంది క‌దా అని స‌ర్దుకుపోయేంత‌లో మ‌న‌సులో మ‌రో కొత్త సందేహం రావొచ్చు. అదేమంటే.. ఆవుపాలు.. గేదె పాల రుచి తెలిసిందే. మ‌రి.. బొద్దింక‌ల పాల రుచి మాటేమిటి? అన్నది చూస్తే.. అంద‌రూ అనుకున్న‌ట్లుగా ఛండాలంగా ఏమీ ఉండ‌ద‌ట‌. ఓకేన‌ని చెబుతున్నారు. కృత్రిమంగా బొద్దింక‌ల పాలు త‌యారు చేసిన‌ప్పుడు.. రుచి కోసం ఇప్పుడు మార్కెట్లో ఉన్న‌ట్లుగా వెనీలా.. మ్యాంగో.. స్ట్రాబెర్రీ ఫ్లేవ‌ర్లు కూడా క‌లిపేసి త‌యారు చేసేస్తే.. రుచి గోల కూడా ఉండ‌దు క‌దా?
Tags:    

Similar News