ప‌రిటాల ఫ్యామిలీకి జ‌గ‌న్ స‌ర్కారు భ‌ద్ర‌త రెట్టింపు!

Update: 2019-05-28 06:48 GMT
ఎన్నిక‌ల త‌ర్వాత మారే ప్ర‌భుత్వాల నేప‌థ్యంలో రాజ‌కీయంగా విభేదాలు ఉన్న కుటుంబాలు త‌మ భ‌ద్ర‌త మీద ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేయ‌టం స‌హ‌జంగా ఉండేదే. అయితే.. ఇలాంటి ఆందోళ‌న‌ల విష‌యంలో ప్ర‌భుత్వాలు చూసి చూడ‌నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. అందుకు భిన్నంగా త‌మ స‌ర్కార్ ఉండ‌నుంద‌న్న విష‌యాన్ని తాజా నిర్ణ‌యంతో చెప్ప‌క‌నే చెప్పేశారు జ‌గ‌న్.

ఆయ‌న ప్ర‌భుత్వం అధికారికంగా కొలువు తీర‌న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికే పాల‌నా ప‌ర‌మైన అంశాల విష‌యంలో విధాన ప‌ర‌మైన విష‌యాల మీద ఆయ‌న స్ప‌ష్ట‌మైన సంకేతాల్ని అధికారుల‌కు ఇచ్చేయ‌టం తెలిసిందే. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల నేప‌థ్యంలో మాజీ మంత్రి ప‌రిటాల సునీత కుటుంబం త‌మ భ‌ద్ర‌త మీద ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కొత్త ప్ర‌భుత్వంలో త‌మ కుటుంబ భ‌ద్ర‌త మీద మాజీ మంత్రి సునీత ఆందోళ‌న వ్య‌క్తం చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

వీటి ప్ర‌కారం ఇప్పుడున్న గ‌న్ మెన్ల సంఖ్య‌ను భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎనిమిది మంది అద‌న‌పు గ‌న్ మెన్ల‌ను నియ‌మిస్తూ క‌ర్నూలు రేంజ్ డీఐజీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌భుత్వ అధికారిక ఉత్త‌ర్వులు జారీ కావ‌టానికి ముందు ప‌రిటాల సునీత‌.. ఆమె కుమారుడు శ్రీ‌రాములు అనంత‌పురం జిల్లాలోని త‌మ స్వ‌గ్రామ‌మైన వెంక‌టాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబ భ‌ద్ర‌త మీద అనుమానాలు వ్య‌క్తం చేశారు.

కొత్త ప్ర‌భుత్వంలో ఏర్ప‌డే ప‌రిస్థితుల మీద వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాము అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో గెలుపోట‌ములు మామూలేన‌ని.. అంత మాత్రానికే అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. గ్రామాల్లో గొడ‌వ‌లు సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. అలాంటి వాటి విష‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ప‌రిటాల సునీత తాను పోటీ చేయ‌కుండా.. త‌న రాజ‌కీయ వార‌సుడు క‌మ్ కుమారుడు శ్రీ‌రాముల్ని బ‌రిలోకి దింపారు. అయితే.. ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి చేతిలో 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత తొలిసారి త‌మ గ్రామానికి వ‌చ్చారు ప‌రిటాల కుటుంబీకులు. వారిని క‌లిసేందుకు వారి మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ భ‌ద్ర‌త మీద సందేహాల్ని వ్య‌క్తం చేస్తే.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే 8 మంది గ‌న్ మెన్ల‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద వేలెత్తి చూపించే అవ‌కాశం లేకుండా పోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News