బీఆర్ఎస్ వీడి.. టీడీపీ, బీజేపీలోకి ఆ ఇద్దరు.. అక్కడా పొత్తేగా?

Update: 2023-01-06 05:39 GMT
ఉమ్మడి ఖమ్మం రాజకీయాలు భలే రంజుగా సాగుతున్నాయి. ఒకరేమో 40 ఏళ్ల సీనియర్. మరొకరేమో ప్రజాక్షేత్రంలో చురుకు. అయితే, ఒకరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురవగా.. మరొకరికి ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. ఇద్దరికీ ఉమ్మడి జిల్లా అంతటా పట్టు. ఇప్పటికే పార్టీలు మారారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కక ఒకరేమో సొంత గూటి (టీడీపీ)కి వెళ్తుండగా, మరొకరేమో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్నారు.

వారి జోరు చూస్తే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉండేందుకు సిద్ధపడ్డారు. అధికార పార్టీ అధినేతలు దగ్గరకు రానీయకపోవడంతో ఇతర పార్టీల ఫోల్డ్ లోకి వెళ్లిపోతున్నారు.తుమ్మలకు.. టీడీపీకి బలం పైన చెప్పుకొన్న ఇద్దరిలో 40 ఏళ్ల సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు కాగా.. ఎంపీగా టిక్కెట్ దక్కనిది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

వీరిలో తుమ్మల చూపు టీడీపీ వైపు ఉందని చెబుతున్నారు. పొంగులేటి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని సమాచారం. అయితే, తుమ్మల గనుక పూర్వాశ్రమానికి చేరితే.. టీడీపీకి తెలంగాణలో చాలా బలమేనని చెప్పొచ్చు.ఉమ్మడి ఖమ్మంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్ వంటి చోట్ల తుమ్మల సామాజికవర్గం ప్రభావం బాగా ఉంది.

కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను తేల్చే స్థాయి వారిది. జనాభా పరంగా తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో వారి ఎమ్మెల్యేల సంఖ్యనే దీనికి నిదర్శనం. 20 ఏళ్లలోనే బలమైన నేతగా పొంగులేటీ ఇక పొంగులేటీ తక్కువేం కాదు. కేవలం 20 ఏళ్లలోనే ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2014లో తెలంగాణ వచ్చిన వేడిలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఎంపీగా గెలవడమే కాక, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.

అయితే, తర్వాత మారిన పరిణామాల్లో నాటి టీఆర్ఎస్ లో చేరిన వైనం వేరే సంగతి.2019 ఎన్నికల్లో టిక్కెట్ రాకున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి హవా ఏమాత్రం తగ్గలేదు. నాలుగేళ్లుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.అంతేగాక భద్రాది కొత్తగూడెం జిల్లాపైనా చూపు నిలిపారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నారు.

రెండు పార్టీల పొత్తు చిత్రం తుమ్మల, పొంగులేటి ఇద్దరి రాజకీయ జీవితం వెనుకంజకు కారణం 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పరాజయమే. కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే రావడం, టార్గెట్ 100పై దెబ్బపడడంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గపోరును అత్యంత సీరియస్ గా తీసుకుంది. దీంతో పాలేరు నుంచి పరాజయం పాలైన తుమ్మలకు ప్రాధాన్య దక్కలేదు. పొంగులేటికి 2019 లోక్ సభ ఎన్నికల టిక్కెట్ ఇవ్వలేదు.

కాగా, ఇప్పుడు వీరిద్దరూ టీడీపీ, బీజేపీల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర సందర్భం ఎదురుకానుంది. తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుంటే వీరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి.

అంటే విభేదాల కారణంగా ప్రాధాన్యం కోల్పోయి పార్టీలు మారిన వీరు.. అక్కడ తప్పక కలిసి నడవాల్సి వస్తోంది. అయితే, వీరిద్దరి పార్టీ మార్పు, తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు మీద ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారమే ఇదంతా. మున్ముందు సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News