చెల్లెలు కవితమ్మ బతుకమ్మ అంటూ బతకనేర్చింది!

Update: 2022-08-23 05:46 GMT
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నట్లుగా ఢిల్లీ బీజేపీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు కొత్త రచ్చకు కారణమైంది. దీనిపై బీజేపీ నేతలపై కవిత తీవ్రంగా విరుచుకుపడటం.. దీనికి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటి వద్ద ఆందోళన నిర్వహించటం.. అది కాస్తా ఆగమాగం కావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవిత పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మదుయాష్కీ.

తెలంగాణ ఉద్యమం లోకి కేసీఆర్ కుటుంబ సభ్యులు జొర్రిండ్రంటూ మండిపడిన ఆయన.. 'తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్ ఉద్యమంలోకి జొర్రినాడని.. చెల్లెలు కవితమ్మ బతుకమ్మ అంటూ బతకనేర్చింది' అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చినట్లు విమర్శించారు.

కవితమ్మను చెల్లెలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపిస్తోందని మండి పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు నెలకురూ.5 వేలు ఫించన్ జాగృతి సంస్థ  నుంచి ఇస్తామని చెప్పి రూ.300 కోట్లు వసూలు చేసి మోసం చేశారన్నారు.

ఒక మహిళగా లిక్కర్ దందా చేయటానికి సిగ్గు అనిపించటం లేదా? అంటూ మండి పడ్డారు. ఢిల్లీ లీక్కర్ స్కామ్ కేసీఆర్ కుమార్తె ఉందని బీజేపీ ఎంపీ ఆరోపణలు చేస్తే.. కవితనే ప్రత్యేక విమానాల్లో వచ్చి డబ్బులు ఏర్పాటు చేశారని మరో బీజేపీ నాయకుడు ఆరోణలు చేసిన విషయాన్ని మధు యాష్కి గుర్తు చేశారు.

కేసీఆర్ తాను సీఎం అయిన వెంటనే తన కొడుకు.. బిడ్డ పైనా అవినీతి ఆరోపణలు వస్తే క్షమించనని.. చర్యలు తీసుకుంటానని చెప్పారని.. ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కవిత.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణల్ని ఎక్కడా ఖండించలేదన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి  ఉంటే వెంటనే కవితతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలన్నారు.

కవిత పై వచ్చిన ఆరోపణలపై విచారణకు పూర్తిగా సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ పై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ నేతలకు తాను చేసే డిమాండ్ ఒక్కటేనన్న మధుయాష్కీ.. ''ఇందులో కవిత వాటా ఎంత? చెట్ల సంతోష్ వాటా ఎంత? అనేది చెప్పాలి. మనీలాండరింగ్ కూడా ఈ కేసులో ఉంది కాబట్టి సీబీఐతో పాటు ఈడీతోనూ విచారణ జరిపించాలి'' అని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కుటుంబం మీద ఇంత ఘాటుగా రియాక్టు అయ్యింది లేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News