కేసీఆర్ కేబినెట్లో ఈ సీనియ‌ర్ల‌కు నో ఛాన్స్!

Update: 2019-02-01 05:07 GMT
ఒక ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మంత్రుల్ని ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం ఇటీవ‌ల కాలంలో మ‌రే రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హ‌యాంలో ఇలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించార‌ని చెబుతారు. ఆ త‌ర్వాత మ‌రే సీఎం.. మంత్రుల్ని నియ‌మించ‌కుండా ఉన్న‌ది లేదు. ఒక‌వేళ‌.. ఆల‌స్య‌మైతే.. మా సంగ‌తేంటి? అంటూ సీరియ‌స్ గా ప్ర‌శ్నించే ప‌రిస్థితి. తెలంగాణ‌లో అలాంటి ప‌ప్పులు ఉడ‌క‌క‌పోవ‌టం.. అందునా సీఎం కేసీఆర్ అయితే.. అలాంటి ఆలోచ‌న మ‌న‌సులోకి వ‌చ్చినా న‌ష్ట‌మేన‌న్న భ‌యంతో వ‌ణికిపోయే ప‌రిస్థితి.

మ‌రో వారం వ్య‌వ‌ధిలో ఎట్టి ప‌రిస్థితుల్లో మంత్రివ‌ర్గాన్ని విస్త‌రిస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. ఎవ‌రికి అవ‌కాశం ల‌భిస్తుంది?  ఎవ‌రికి హ్యాండ్ ఇస్తారు? అన్నది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా ల‌భించిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఊహించిన రీతిలో కేసీఆర్ మంత్రుల ఎంపిక ఉంటుంద‌ని చెబుతున్నారు.

క‌ల‌లో కూడా అంచ‌నా వేయ‌లేని విధంగా మంత్రుల్ని సెలెక్ట్ చేస్తార‌ని అంటున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో చోటు చేసుకునే రాజ‌కీయ ప‌రిణామాల‌కు అనుగుణంగా మంత్రుల ఎంపిక ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప‌లువురు సీనియ‌ర్ల‌కు కేసీఆర్ హ్యాండిస్తార‌ని తెలుస్తోంది.  ఉద్య‌మ నాయ‌కుడిగా అడుగులు వేసిన నాటి నుంచి కేసీఆర్ వెంట ఉన్న వారు.. తెలంగాణ తొలి ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన వారికి చోటు ల‌భించ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఎన్నిక‌ల వేళ‌.. రాష్ట్ర హోంమంత్రి.. సీనియ‌ర్ ఉద్య‌మ‌నేత‌గా.. కేసీఆర్‌ కు అత్యంత ద‌గ్గ‌ర మ‌నిషిగా చెప్పే నాయినికి టికెట్ ఇవ్వ‌కుండా సంచ‌ల‌నం సృష్టించిన కేసీఆర్‌.. ఇదే త‌ర‌హా లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా త‌న మార్క్ ను ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెబుతున్నారు.

కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితులుగా చెప్పే ఈటెల రాజేంద‌ర్ కు ఈసారి చోటు ల‌భించ‌ద‌ని చెబుతున్నారు. ఇక‌.. మేన‌ల్లుడు హ‌రీశ్ విష‌యంలోనూ కేసీఆర్ ఆలోచ‌న‌లువేరుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. దాదాపు ఆయ‌న‌కు చోటు ల‌భించ‌ద‌ని.. ఒక‌వేళ ఇచ్చినా శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాలు.. రెవెన్యూ ఇచ్చే వీలుంద‌ని తెలుస్తోంది. ఇక‌.. మ‌రో సీనియ‌ర్ నేత.. కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా చెప్పే క‌డియం శ్రీ‌హ‌రికి ఈసారి హ్యాండిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌.. ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుకు సైతం చోటు ల‌భించ‌ద‌ని చెబుతున్నారు. ఇలా.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌లకు మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన వారిలో ప‌లువురికి మంత్రులు అయ్యే అదృష్టం లేదంటున్నారు. అదే జ‌రిగితే.. వారి రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News